ఏపీ సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజ్ భవన్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!
ఏపీలో రాష్ట్రస్దాయిలోని వివిధ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రాజధాని నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం, ఆయా ఉద్యోగుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఆయా ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అమరావతి రాజధానిలోని రాష్ట్ర సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, విభాగాధిపతుల కార్యాలయాలతో పాటు విజయవాడలోని గవర్నర్ అధికారిక నివాసం రాజ్ భవన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉచిత వసతి సదుపాయం ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఈ గడువు జూన్ 27తో ముగిసిపోయింది. దీంతో వారికి మరో ఏడాది పాటు ఈ ఉచిత వసతి సదుపాయాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఆయా ఉద్యోగులకు వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ వరకూ ఈ ఉచిత వసతి సదుపాయం వాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

అమరావతి రాజధాని ప్రకటన తర్వాత హైదరాబాద్ లో కుటుంబాలతో సహా ఉన్న ఉద్యోగులు ఇక్కడికి హుటాహుటిన రావాల్సి వచ్చింది. వీరంతా అప్పట్లో కుటుంబాలను, చదువుకుంటున్న పిల్లల్ని అక్కడే ఉంచి అమరావతికి తరలివచ్చారు. దీంతో వీరికి ఉచితంగా షేరింగ్ విధానంలో వసతి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచీ ఈ సదుపాయాన్ని ప్రతీ ఏడాదీ పొడిగిస్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఏడాది పాటు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వీరంతా మరో ఏడాది పాటు ఉచిత వసతి తీసుకునేందుకు అర్హత పొందినట్లయింది.












Click it and Unblock the Notifications