కొత్త మద్యం దుకాణాల ఖరారు, ప్రారంభం పై ప్రభుత్వం తాజా నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం మద్యం పాలసీ అమలు వేళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. ఈ టెండర్ల దాఖలు సమయంలో కూటమి నేతల జోక్యం పైన రాజకీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నేటితో టెండర్లు ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. ఇదే సమయంలో ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకటించింది.
ప్రభుత్వ ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాల లైసెన్సుల కోసం టెండర్లు ఆహ్వానించింది. ప్రభుత్వం జాతీ చేసిన నోటిఫికేషన్ మేరకు ఈ రోజుతో గడువు ముగియనుంది. అయితే, ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాలేదనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో కొనసాగుతోంది. దరఖాస్తుల ఫీజు ద్వారానే దాదాపు గా రూ 2 వేల కోట్ల వరకు వస్తుందని అంచనా వేసారు. అయితే..ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం మేరకు దరఖాస్తుల తుది గడవు ఈ నెల 11వ తేదీ సాయంత్రం వరకూ గడువు పెంచారు. ఈ నేపథ్యంలో 11వ తేదీకి బదులుగా 14న లాటరీ తీసి లైసెన్సులు ఖరారు చేస్తారు.

ప్రభుత్వ తాజా నిర్ణయం
అదే విధంగా 16వ తేదీ నుంచి కొత్త లైసెన్సు దారులు దుకాణాలు ప్రారంభించుకోవచ్చు. అదే రోజు నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్‌కుమార్ మీనా తాజా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ చేయాల్సి ఉంది. కాగా, మంగళవారం రాత్రి 9 గంటల వరకూ 41,348 దరఖాస్తులు అందాయి. నాన్ రిఫండబుల్ రుసుముల రూపంలో ప్రభుత్వానికి రూ.826.96 కోట్ల ఆదాయం వచ్చింది. గడువు పొడిగిస్తున్న నేపథ్యంలో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.
దరఖాస్తు దారుల కోసం
తిరుపతి, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, అనంతపురం, నంద్యాల జిల్లాల్లో నోటిఫై చేసిన దుకాణాల సంఖ్యతో పోలిస్తే వచ్చిన దరఖాస్తుల సంఖ్య తక్కువగా ఉంది.
టెండర్ల దాఖలు సమయంలో ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల గురించి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. దీని పైన కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. ఇటు నాన్ రీఫండ్‌బుల్ రుసుములు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు వెసులుబాట్లు కల్పించింది. పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ఎక్సైజ్ స్టేషన్‌లలో సంప్రదించాలని సూచించింది. ఇక, ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత ఈ నెల 16 నుంచి కొత్త మద్యం విధానం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్దమైంది.












Click it and Unblock the Notifications