AP Nominated Posts: ఏపీలో 20 నామినేటెడ్ పోస్టుల భర్తీ-ఎవరికి ఏ పోస్టు అంటే..?
ఏపీలో నాలుగు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ తొలి విడతగా నామినేటెడ్ పోస్టుల భర్తీ చేపట్టింది. ఇవాళ 20 మందితో తొలి జాబితాను సీఎం చంద్రబాబు విడుదల చేశారు. ఇందులో వక్ఫ్ బోర్డు, ఆర్టీసీ సహా పలు కార్పోరేషన్ ఛైర్మన్ల పోస్టులు ఉన్నాయి. గతంలో ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారు, పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్నవారు, సమర్ధత ఆధారంగా వీటిని భర్తీ చేసినట్లు తెలుస్తోంది.
వక్ఫ్ బోర్డు ఛైర్మన్ గా నెల్లూరు జిల్లాకు చెందిన అబ్దుల్ అజీజ్ ను నియమించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) ఛైర్మన్ గా అనిమిని రవినాయుడును నియమించారు. ఏపీ హౌసింగ్ బోర్డ్ ఛైర్మన్ గా బత్తుల తాత్యబాబుకు అవకాశం దక్కింది.ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం (ఏపీ ట్రైకార్) చైర్మన్ గా బొరగం శ్రీనివాసులును నియమించారు. ఏపీ మారిటైమ్ బోర్డ్ ఛైర్మన్ గా దామచర్ల సత్యను నియమించారు.

సీడాప్ ఛైర్మన్ గా దీపక్ రెడ్డిని నియమించారు. 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ గా బీజేపీ నేత లంకా దినకర్ కు అవకాశం ఇచ్చారు. ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్ గా కర్రోతు బంగార్రాజును నియమించారు. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా మన్నె సుబ్బారెడ్డికు అవకాశం లభించింది. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీఐఐసీ) చైర్మన్ గా మంతెన రామరాజు ను నియమించారు.
ఏపీ పద్మశాలి సంక్షేమ మరియు అభివృద్ధి సంస్థ ఛైర్మన్ గా నందం అబద్దయ్య ను నియమించారు. ఏపీ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా నూకసాని బాలాజీకి అవకాశం దక్కింది. ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా కొనకళ్ల నారాయణకు, వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నంను నియమించారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణకు అవకాశమిచ్చారు. లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా పిల్లి మాణిక్యాల రావును నియమించారు.
ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి ఛైర్మన్ గా పీతల సుజాతను నియమించారు. ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్(జనసేన) ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ ఛైర్మన్ గా జనసేన నేత తోట మెహర్ సుధీర్‌ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఛైర్మన్ గా వజ్జా బాబురావుకు అవకాశమిచ్చారు. ఏపీ టౌన్‌షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ టిడ్కో ఛైర్మన్ గా జనసేన నేత వేములపాటి అజయ్‌కుమార్ ను నియమించారు.












Click it and Unblock the Notifications