ఏడాది పాలన సందర్భంగా భారీ శుభవార్త చెప్పనున్న కూటమి ప్రభుత్వం.. 3 లక్షల మందికి లబ్ధి!
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గతేడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మొత్తం 175 స్థానాలకు గానూ 164 చోట్ల టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి త్వరలో అంటే జూన్ 12 నాటికి ఏడాది పూర్తి కానుంది. దీంతో రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్త చెప్పేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కసరత్తులు చేస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ దిశగా సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. మూడు లక్షల మంది పేదలకు ఇళ్లు అందించి.. జూన్ 12న వారితో గృహ ప్రవేశాలు చేయించే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
గృహ నిర్మాణానికి గ్రామాల్లో అయితే 3 సెంట్లు, పట్టణాల్లో అయితే రెండు సెంట్లు కేటాయించనుంది. ఈమేరకు ఇప్పటికే అధికారులకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల నుంచి వచ్చే దరఖాస్తుల మేరకు సర్వే ద్వారా అర్హులను గుర్తిస్తారు. అనంతరం నిర్మాణానికి సైతం ఆర్థిక సాయం అందిస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన కేటాయింపులతో పోల్చితే ఇప్పుడు స్థల పరిమాణం ఎక్కువని అధికారులు తెలిపారు. వైసీపీ గరిష్ఠంగా సెంటున్నరే ఇచ్చినట్లు వివరించారు.

జూన్ 12 నాటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతుంది కాబట్టి ఆ తేదీ లోపే ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని అధికారులకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ (హౌసింగ్) అజయ్ జైన్ పలు సూచనలు చేశారు. 3 లక్షల ఇళ్లల్లో ఇప్పటి వరకూ 1.70 లక్షల వరకు పూర్తి కాగా.. మరో 60 వేల ఇళ్లు తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది. గడువు లోగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేయించేందుకు ప్రభుత్వం అదనపు సాయం కూడా అందిస్తోంది. బీసీ, ఎస్సీ వర్గాల లబ్ధిదారులకు రూ.50 వేలు చొప్పున, ఎస్టీలకు రూ.75 వేలు చొప్పున ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం సాయం చేస్తోంది.












Click it and Unblock the Notifications