ఏపీలో మల్టీప్లెక్స్ , మాల్స్ లో ఇక ఫ్రీ పార్కింగ్- కండిషన్స్ అప్లై..!
మల్టీప్లెక్స్ లేదా మాల్స్ కు వెళ్తున్నామంటే అక్కడ షాపుల్లో ఉండే రేట్ల కంటే వాటి పార్కింగ్ లో వాహనాలకు విధించే ఛార్జీలు చూసి వాహనదారులు బెంబేలెత్తుతుంటారు. దీంతో ఈ వివాదం ప్రతీ రాష్ట్రంలోనూ, ప్రతీ మల్టీప్లెక్స్, ప్రతీ మాల్ లోనూ ఉంది. దీనిపై వినియోగదారుల ఫోరాలు, కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినా అవి అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో పార్కింగ్ పీజులపై కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రంలోని మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో ఉన్న పార్కింగ్ స్ధలాల్లో వాహనాల పార్కింగ్ కు తొలి అరగంట పాటు పూర్తి ఉచితంగా నిర్ణయించారు. ఆ తర్వాత మాత్రమే కొన్ని షరతులతో ఆయా మల్టీప్లెక్స్ లు, మాల్స్ పార్కింగా్ ఛార్జీలు విధించేందుకు అవకాశం కల్పించారు. ఈ షరతుల్లో ఆయా మల్టీప్లెక్స్ లలో ఉండే సినిమా థియేటర్లలో సినిమాలకు వెళ్లిన వారు టికెట్ చూపిస్తే ఎలాంటి పార్కింగ్ ఫీజు వసూలు చేయకూడదు.
అలాగే మాల్ కు వెళ్లిన వారు షాపింగ్ చేసిన బిల్లు చూపించినా పార్కింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఇస్తారు. ఈ రెండూ కాకుండా ఊరికే మాల్ లో తిరిగేసి వచ్చే వారికి మాత్రం అరగంట తర్వాత వారి వాహనాలకు పార్కింగ్ పీజు వసూలు చేస్తారు. అయితే ఈ ఫీజు ఎంత వసూలు చేయాలనే దానిపై మాత్రం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వుల్లో పేర్కొనలేదు. అంటే ప్రస్తుతం ఆయా మల్టీప్లెక్స్ లు, మాల్స్ లో ఎంత పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారో అదే వీరికి వర్తించబోతోంది. దీంతో మల్టీప్లెక్స్ లలో సినిమాకో, మాల్స్ లో షాపింగ్ కు వెళ్లిన వారికి మాత్రం పార్కింగ్ ఫీజుల నుంచి ఊరట లభించినట్లే. వచ్చే నెల 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి.













Click it and Unblock the Notifications