పన్ను చెల్లింపుదారులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్-తాజా మార్పులివే..!
ఏపీలో పన్ను చెల్లింపు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో పన్నుల చెల్లింపు ప్రక్రియ మరింత సులభం చేస్తూ పన్ను చెల్లింపు దారులకు, వ్యాపారులకు అనుకూల వాతావరణాన్ని కల్పించే దిశగా వాణిజ్య పన్నుల శాఖ నూతన ఆవిష్కరణలు చేసిందని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రకటించారు. విజయవాడలో జ్ఞాన క్షేత్రం, కమర్షియల్ ట్యాక్స్ విజన్, మిషన్ వ్యాల్యూస్, 'జీఎస్టీ మిత్ర' లోగోను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆవిష్కరించారు.
రాష్ట్రంలో జీఎస్టీ చెల్లింపుదారులకు జీఎస్టీ నెట్ వర్క్, మొబైల్ నంబర్ నమోదుతో పన్నుదారులకు ఓటీపీ ఆధారంగా మరింత సులువుగా సేవలు అందించడంతో పాటు పన్ను చెల్లింపులు, ఆర్థిక సంవత్సరాల నివేదికలు సహా ఎన్నో సౌలభ్యాలు ఉన్నాయని ఆర్ధికమంత్రి బుగ్గన తెలిపారు. రాష్ట్రంలో పన్ను చెల్లింపుదారులకు మెరుగైన సేవల కోసం అత్యాధునిక సాంకేతికత వినియోగించి వాణిజ్య శాఖలో వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టామని తెలిపారు. నిజాయితీగా పన్నులు కట్టే వినియోగదారుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.

జీఎస్టీ ఎగవేతలను అరికట్టడంతో పాటు వ్యాపార, వాణిజ్య వర్గాలకు సేవలు అందుబాటులో ఉండేలా రాష్ట్రవ్యాప్తంగా 12 జీఎస్టీ సేవాకేంద్రాలను ఏర్పాటు చేశామని ఆర్ధిక మంత్రి పేర్కొన్నారు. ప్రత్యేకించి విజయవాడ నంబర్ 1 డివిజన్ లో మొదటి జీఎస్టీ సేవా కేంద్రం ప్రారంభించడం మైలురాయిగా భావిస్తున్నామన్నారు. కొందరు ఇన్పుట్ టాక్స్ ఎగవేతలకు దొడ్డిదారులను ఎంచుకుంటున్నారని తద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతోందన్నారు. జీఎస్టీ సేవా కేంద్రాల ద్వారా సులువుగా పన్నులు చెల్లించేందుకు, రిజిస్ట్రేషన్లకు ఆస్కారం ఉందని మంత్రి అన్నారు.

ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ నమోదు ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా నకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్లను అరికట్టగలుగుతామని ఆయన తెలిపారు. భారత దేశంలో ఈ సేవా కేంద్రాల పద్ధతి మూడు రాష్ట్రాలలో మాత్రమే ఉందని తెలిపారు. ట్యాక్స్ కట్టే వారిని దోపిడీదారులుగా కాకుండా వారితో ట్యాక్స్ ఎలా కట్టించాలో ఆలోచించాలన్నారు. ట్యాక్స్ కట్టే వారి వల్లే దేశం నడుస్తుందని ఆయన తెలిపారు. గతంలో మాదిరి పన్నులు ఎగ్గొట్టే వారిని పట్టుకోవడం కన్నా.. పన్ను వసూళ్లను సరళతరం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications