మందుబాబులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్..! ఉత్తర్వులు జారీ...
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. గత ప్రభుత్వంలో ఎక్కువ రేట్లకు నాసిరకం మద్యం కొనుగోలు చేసి తాగలేక ఇబ్బందులు పడ్డ వారికి కూటమి ప్రభుత్వం వచ్చీ రాగానే శుభవార్త చెప్పింది. పాత బ్రాండ్లన్నింటినీ తిరిగి తీసుకురావడంతో పాటు రేట్లు తగ్గించి అమ్మేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో పాటు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం మారినా మద్యం రేట్లు తగ్గలేదని జనం నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
కొత్త ఎక్సైజ్ విధానం ప్రకారం ప్రభుత్వం తాజాగా మద్యం షాపులను లాటరీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించింది. అయితే వారు ఇష్టారాజ్యంగా ఎమ్మార్పీని మించి ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు టికెట్లు అమ్మే వారిపై కొరడా ఝళిపించింది. మద్యం అక్రమాల వ్యవహారాల్లో భారీ జరిమానాలు విధిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది.

ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయిస్తే ఐదు లక్షలు జరిమానా విధించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
రెండోసారి అదే తప్పు చేస్తే మద్యం దుకాణం లైసెన్స్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మద్యం దుకాణం పరిధిలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే ఐదు లక్షల జరిమానా విధిస్తారు. ఇదే తప్పు రెండోసారి చేస్తే దుకాణం లైసెన్స్ రద్దుకు నిర్ణయించారు.
ఏపీ ఎక్సైజ్ చట్టం సెక్షన్ 47(1) ప్రకారం ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇదే నిబంధన కింద బార్ లైసెన్సులకూ వర్తిస్తాయని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications