
సీఎం జగన్ కీలక నిర్ణయం: EWS రిజర్వేషన్ అమలు : కాపులకు అందులోనే-గతం గతః
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్దికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్) విద్య-ఉద్యోగాల్లో రిజర్వేషన కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 10 శాతం మేర రిజర్వేషన్లను అమలు చేయాలని డిసైడ్ చేసారు. 2019 లో కేంద్ర తీసుకొచ్చిన చట్టం ప్రకారం (ఈడబ్ల్యూఎస్) రిజర్వేషన్లు తీసుకొచ్చింది. విద్యా, ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కోటా ప్రవేశపెడుతూ కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగాన్ని సవరించింది.

ఏపీలోనూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు..
అయితే... దీనికి పలు నిబంధనలను విధించింది. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలోకి రావాలంటే... ఐదెకరాలకు మించి వ్యవసాయ భూమి ఉండొద్దు. నగరాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణాన్ని మించి ఫ్లాట్ ఉండొద్దు. నగరాల్లో అయితే వంద గజాలు, గ్రామాల్లో రెండొందల గజాలకు మించిన ఇంటి స్థలం ఉన్న వారు ఈడబ్ల్యూఎస్ కోటా కిందికి రారని కేంద్రం చెప్పింది. అయితే... ఇప్పుడు అవన్నీ తీసేసి, కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలకు మించరాదనే ప్రాతిపదికను మాత్రమే రాష్ట్రంలో తీసుకున్నారు.

కాపులకు గతంలో 5 శాతం...ఇప్పుడు ఈ కోటాలోనే..
ఈడబ్ల్యూఎస్ కింద కేంద్రం ఇచ్చిన పది శాతం కోటాలో ఐదు శాతాన్ని చంద్రబాబు కాపులకు కేటాయించారు. మరో ఐదు శాతాన్ని ఇతర అగ్రవర్ణ పేదలకు వర్తింప చేశారు. ఈ మేరకు అసెంబ్లీలో చట్టం చేసి.. దానిని కేంద్రం ఆమోదం కోసం పంపించారు. కానీ, కేంద్రం నుంచి ఆమోదం రాలేదు. ఆ తర్వాత దీనిపై కోర్టుల్లోనూ కేసులు పడ్డాయి. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక... ఈడబ్ల్యూఎస్ కోటా గురించి పట్టించుకో లేదు. తాజా జీవో ప్రకారం... కాపులు కూడా పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా పొందే అగ్రవర్ణాల పరిధిలోకే వస్తారు.

అగ్రవర్ణ పేదల కోసం..
ఈడబ్ల్యూఎస్ వర్గాలకు విద్యావకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2019 జూలై 27న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దానికి కొనసాగింపుగా ఉద్యోగావకాశాల్లోనూ 10% రిజర్వేషన్లు కల్పిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ రిజర్వేషన్లు అమలు కావాలంటే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ కేటగిరీలలోకి రాని వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఈ రిజర్వేషన్లకు అర్హులు. కుటుంబ వార్షిక ఆదాయం గరిష్టంగా రూ.8 లక్షల లోపు ఉండాలి. ఈడబ్ల్యూఎస్ కింద ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రోస్టర్ పాయింట్లను తర్వాత ప్రత్యేకంగా నిర్ణయిస్తామని ప్రభుత్వం పేర్కొంది.

ఓబీసీ క్రిమిలేయర్ పరిమితి పెంపు
ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద కల్పించే పది శాతం రిజర్వేషన్లలో మూడో వంతు ఆ వర్గాలకు చెందిన మహిళలకు కేటాయిస్తారు. అర్హులైన వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీ చేసే అధికారాన్ని తహసీల్దార్లకు కల్పించారు. 10 శాతం ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన రోస్టర్ పాయింట్లను, ఇతర నిబంధనలతో తదుపరి ఉత్తర్వులు జారీ కానున్నాయి. మరోవైపు... ఓబీసీలకు క్రీమీలేయర్ ఆదాయ పరిమితిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. గతంలో ఉన్న రూ.6 లక్షలను ఇప్పుడు 8 లక్షలకు పెంచింది.