ఏపీలో పగటి కర్ఫ్యూ ఎత్తివేత- తూర్పుగోదావరి మినహా- ఈ నెల 21 నుంచి అమలు
ఏపీలో కరోనా కేసుల ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో పగటి పూట కర్ఫ్యూను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ప్రకటించిన విధంగా కర్ప్యూ ఆంక్షలు ఈ నెల 20 వరకూ అమలు కానుండగా.. ఈ నెల 21 నుంచి తాజా సమయాలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఇప్పటివరకూ అమల్లో ఉన్న పగటి పూట కర్ఫ్యూను ఈ నెల 21 నుంచి ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సాయంత్రం 6 గంటల నుంచి తిరిగి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకే కర్ఫ్యూను కొనసాగిస్తారు. పూర్తిగా కేసులు తగ్గిపోతే మరోసారి సమీక్షించి వీటిని కూడా తొలగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ వైద్యశాఖ అధికారులతో జరిగిన కరోనా సమీక్షలో సీఎం జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నా ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం కరోనా వ్యాప్తి తగ్గడం లేదు. దీంతో తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రస్తుతం ఉన్న కర్ఫూ సమయాల్నే మరికొన్ని రోజులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో మరికొన్ని రోజులు కర్ఫ్యూ అసరమని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే మినహాయింపులు కొనసాగుతాయి. మిగతా జిల్లాల్లో మాత్రం సాయంత్రం ఆరు గంటల వరకూ మినహాయింపు ఉంటుంది.
కర్ఫ్యూ సమయాల్లో మార్పుల నేపథ్యంలో ఈ నెల 21 నుంచి ప్రభుత్వ కార్యాలయాల్ని పూర్తి సమయం పనిచేయించాలని ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ప్రభుత్వ కార్యాలయాలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేస్తున్నాయి. అలాగే రాష్ట్రంలో బ్యాంకులు కూడా మధ్యాహ్నం 2 గంటల వరకే సేవలు అందిస్తున్నాయి. ఈ నెల 21 నుంచి పగటి కర్ఫ్యూ ఎత్తివేస్తున్నందున తూర్పుగోదావరి మినహా మిగిలిన జిల్లాల్లో పూర్తి సమయం పనిచేస్తాయి.












Click it and Unblock the Notifications