Kadambari jethwani: ముంబై నటి వేధింపుల వ్యవహారంపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో ముంబైకి చెందిన సినీ నటి కాదంబరి జెత్వానీని పలువురు అధికార పార్టీ నేతలు కొందరు ఐపీఎస్ అధికారుల సాయంతో వేధించిన వ్యవహారంపై ఏపీ సర్కార్ ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే సదరు నటి టీవీ ఛానళ్ల ముందుకు వచ్చి తనకు జరిగిన అన్యాయం, వేధింపులపై నోరువిప్పిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. ఈ వ్యవహారంలో ఎవరెవరి పాత్ర ఉందో తెల్చేందుకు విచారణకు ఆదేశించింది.

వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ కొన్నేళ్ల కిందట హైదరాబాద్‌లో ఓ పెళ్లికి వెళ్లిన సమయంలో పరిచయమైన సినీ నటి కాదంబరి జెత్వానీ.. ఆ తర్వాత ఆయనకు దగ్గరైంది. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా విద్యాసాగర్ నిరాకరించారు. దీంతో ఈ ఏడాది జనవరిలో ఆమె నుంచి ఒత్తిడి పెరగడంతో విద్యాసాగర్ వైసీపీ అగ్రనేతల్ని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను విద్యాసాగర్ వదిలించుకునేందుకు వైసీపీ పెద్దలు కొందరు ఐపీఎస్ ల సాయంతో ఆమెను ముంబైకి వెళ్లి అరెస్టు చేసి విజయవాడ తెచ్చి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇందులో ఐపీఎస్ అధికారులు విశాల్ గున్నీతో పాటు కాంతిరాణా టాటా పాత్రపై ఆరోపణలు రావడంతో ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వీరిద్దరిపై ప్రభుత్వం గుర్రుగా ఉంది. ముంబై నటి కాదంబరిపై వేధింపుల వ్యవహారంలో వీరి పాత్రతో పాటు వైసీపీ నేతల పాత్రను తేల్చేందుకు ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. జెత్వానీతో ఆన్ లైన్ లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రతి అంశాన్ని క్షుణంగా దర్యాప్తు చేయాలని సూచించింది. అయితే దీనిపై విచారణ కమిటీ నియమించే అవకాశముంది.












Click it and Unblock the Notifications