ముస్లింలకు చంద్రబాబు మరో రంజాన్ కానుక..!
ఏపీలో కూటమి ప్రభుత్వం 24 గంటల వ్యవధిలో ముస్లింలకు రెండో శుభవార్త చెప్పింది. నిన్న సచివాలయంలో జరిగిన కార్యదర్శులు, విభాగాధిపతుల సమావేశంలో సీఎం చంద్రబాబు అధికారుల సమక్షంలోనే ముస్లింలకు సంబంధించి ఓ కీలక ప్రకటన చేయగా.. ఇవాళ ప్రభుత్వం మరో విషయంలో ముస్లిం ఉద్యోగులకు ఊరట కలిగించేలా మరో ఉత్తర్వు జారీ చేసింది. దీంతో త్వరలో ప్రారంభమయ్యే రంజాన్ మాసం కంటే ముందే ముస్లింలకు గుడ్ న్యూస్ లభించినట్లయింది.
గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ముస్లింలకు రంజాన్ తోఫా పథకం అమలు చేసింది. దీని ద్వారా రంజాన్ మాసంలో పేద ముస్లింలకు అవసరమైన నిత్యావసర వస్తువులు అందించే వారు. ఈ పథకాన్ని అప్పట్లో ఐదేళ్ల పాటు విజయవంతంగా అమలు చేసినా ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పక్కనబెట్టేసింది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించాలని చంద్రబాబు నిన్న కార్యదర్శుల సమావేశంలో అధికారుల్ని ఆదేశించారు.

దీనికి కొనసాగింపుగా ఇవాళ రంజాన్ మాసానికి సంబంధించి ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఓ గంట ముందుగానే ఇంటికి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వచ్చే నెల 2 నుంచి 30వ తేదీ వరకూ రంజాన్ మాసం మొత్తం ఇలా అన్ని ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గంట ముందు ఇళ్లకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది. ఇందులో టీచర్లు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది ఇలా అందరికీ వెసులుబాటు ఇచ్చారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షల విరమణ సందర్బంగా ఈ వెసులుబాటు ఇచ్చారు.













Click it and Unblock the Notifications