AP GPS Bill : ఏపీ అసెంబ్లీలో జీపీఎస్ బిల్లు-ఉద్యోగులు అండగా నిలవాలన్న బుగ్గన..
ఏపీలో ఉద్యోగులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ విధానం రద్దు చేస్తూ దాని స్ధానంలో జీపీఎస్ విధానం తీసుకొచ్చిన ప్రభుత్వం .. దాన్ని చట్టబద్ధం చేసేందుకు ఇవాళ కీలక అడుగు వేసింది. అసెంబ్లీ వేదికగా జీపీఎస్ బిల్లును ప్రవేశపెట్టింది. జీపీఎస్ బిల్లును గతంలోనే కేబినెట్ ఆమోదించినప్పటికీ తాజాగా కొన్ని మార్పులు చేశారు. దీంతో ఇది మరోసారి కేబినెట్ దీన్ని ఆమోదించడంతో ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ ఉద్యోగుల కష్టాన్ని సీఎం జగన్ గుర్తించారని బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెలిపారు. సీపీఎస్ ను రివ్యూ చేయాలని ఉద్యోగులు చాలాకాలం నుండి డిమాండు చేస్తున్నారని అన్నారు. పలు విడతలుగా ఉద్యోగులతో చర్చించిన తర్వాత జీపీఎస్ ను హైబ్రీడ్ మోడల్ గా కేబినెట్ అమోదించిందన్నారు. మంత్రులు, అధికారులు కమిటీ చాలా అంశాలను పరిశీలించి జీపీఎస్ ను రూపోందించిందని వెల్లడించారు.

ఉద్యోగులంతా ప్రభుత్వంలో ముఖ్యమైన భాగమని బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవటంలో ఉద్యోగులు కీలకంగా నిలవాలన్నారు. గ్యారెంటీడ్ పెన్షన్ స్కీమ్ ను చట్టంగా రూపోందించేందుకు శాసనసభలో ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు 11వ పీఆర్సీని అమలుచేసామని ఆర్ధికమంత్రి తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటై ర్ మెంట్ వయసు 60 నుంచి 62 ఏళ్లకు పెంచామని గుర్తుచేశారు.
2014 జూన్ రెండు కంటే ముందు అపాయింట్ అయిన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్దీకరిస్తున్నట్లు ఆర్ధిక మంత్రి తెలిపారు. ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి ఆరోపణలు లేకుండా మెరిట్ ప్రకారం భర్తీ చేస్తున్నామని బుగ్గన పేర్కొన్నారు.ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్ రద్దు చేసిన ప్రభుత్వం దాని స్ధానంలో మెరుగైన జీపీఎస్ విధానం తీసుకొస్తామని ప్రకటించింది. ఇందులో భాగంగా జీపీఎస్ బిల్లును తయారు చేసి గతంలో కేబినెట్ ఆమోదం కోసం పెట్టింది. కేబినెట్ లో ఆమోదించిన తర్వాత ఇందులో పలు లోపాలు ఉన్నట్లు గుర్తించింది. దీంతో వాటిని సరిచేస్తూ మరోసారి కేబినెట్ లో ఈ ఫైల్ పంపి మంత్రుల ఆమోదం తీసుకుంది.












Click it and Unblock the Notifications