ఏపీ సర్కార్ బంపరాఫర్.. గీత కార్మికులకు 10 శాతం బార్ షాపులు!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గీత కార్మికులకు తీపికబురు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా అమలవుతోన్న మద్యం పాలసీలో కీలక మార్పులు చేస్తూ కొత్త బార్ పాలసీని ప్రవేశపెట్టనుంది. సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త బార్ పాలసీలో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బార్ షాపుల్లో 10 శాతం షాపులు గీత కార్మికులకు కేటాయించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ ప్రకారం మొత్తం 840 బార్లలో 84 బార్లు గీత వర్గాలకు రిజర్వ్ చేయబోతున్నట్టు సమాచారం. కాగా ఈ కేటాయింపు లాటరీ విధానంలో జరిగేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో గీత కార్మికులకు ఆర్థికంగా మరింత ప్రోత్సాహం లభిస్తుందని భావిస్తున్నారు. ఇప్పటికే వైన్ షాపుల కేటాయింపులో కూడా గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్న సంగతి తెలిసిందే.

మరోవైపు బార్లకు లైసెన్స్ ఫీజుల విషయంలో ప్రభుత్వం రెండు రకాల ప్రతిపాదనలు పరిశీలిస్తోంది:
మొదటి ప్రతిపాదన..
నగర పంచాయతీలు - రూ.35 లక్షలు
మున్సిపాలిటీలు - రూ.40 లక్షలు
కార్పొరేషన్లు - రూ.45 లక్షలు
రెండో ప్రతిపాదన..
నగర పంచాయతీలు - రూ.55 లక్షలు
మున్సిపాలిటీలు - రూ.65 లక్షలు
కార్పొరేషన్లు - రూ.75 లక్షలు
మొదటి ప్రతిపాదనలో ఆదాయం తగ్గే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం బార్ల సంఖ్యను 840 నుండి వెయ్యికి పైగా పెంచే ఆలోచనలో ఉంది. రెండో ప్రతిపాదన అమలు చేస్తే, ఫీజు ఎక్కువ అయినా బార్ల సంఖ్య యథావిధిగా కొనసాగుతుంది. అలాగే, దరఖాస్తు ఫీజును రూ.5 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. వైసీపీ హయాంలో బార్లకు వేలం పద్ధతిలో లైసెన్స్‌లు ఇవ్వగా.. ఇప్పుడు కొత్త పాలసీలో లాటరీ పద్ధతిని అనుసరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత బార్లకు లైసెన్స్ పొడిగింపు కాకుండా, అన్నిటికీ తిరిగి లైసెన్స్‌లు జారీ చేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
ఆదాయం కంటే.. ఆరోగ్యం ముఖ్యం
సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో నూతన బార్ పాలసీ అమల్లోకి వస్తుందని.. సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ పాలసీకి క్యాబినెట్ సబ్ కమిటీ నివేదిక ఆధారంగా రూపురేఖలు రూపొందించామన్నారు. ఆల్కహాల్ తక్కువ ఉన్న మద్యం వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా నష్టాలను తగ్గించవచ్చని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీ పాలనలో మద్యం పాలసీని నిర్వాకంగా అమలు చేశారని విమర్శించిన సీఎం, కొత్త పాలసీ ద్వారా గత పాలనలో ఉన్న లోపాలను సరిచేస్తామని హామీ ఇచ్చారు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యం ముఖ్యమని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications