అమరావతికి వరద ముప్పు? తప్పించేందుకు సర్కార్ కీలక అడుగు..!
ఏపీ రాజధాని అమరావతికి వరద ముప్పు పొంచి ఉందన్న చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. ప్రభుత్వం ఎంత లేదు లేదు అంటున్నా రాజధానికి ఉన్న వరదల ముప్పుపై ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రభుత్వం వరదల నివారణకు అమరావతి రాజధానిలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు త్వరలో కార్యాచరణ కూడా ప్రారంభించబోతోంది.

అమరావతి రాజదాని ప్రాంతాన్ని కృష్ణా నది వరదల నుంచి రక్షించేందుకు గతంలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. అయితే దీంతో వరదలకు పూర్తిస్ధాయిలో అడ్డుకట్టే వేయడం సాధ్యం కాదన్న అంచనాల నేపథ్యంలో అమరావతి రాజధాని నిర్మాణానికి సిద్ధమవుతున్న ప్రభుత్వానికి రుణాలు ఇవ్వబోతున్న ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు పలు సూచనలు చేశాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం రాజధానిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి అదనంగా మరో ఎత్తిపోతల పథకం నిర్మించేందుకు సిద్దమవుతోంది.
కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం పక్కనే మరో లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణం కోసం డీపీఆర్ సిద్ధం చేయాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది. 7350 క్యూసెక్కుల సామర్ధ్యంతో ఈ కొత్త ఎత్తిపోతల పథకానికి డీపీఆర్ తయారు చేయబోతున్నారు. దీనికి అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏడీసీఎల్ టెండర్లను కూడా ఆహ్వానించింది. ఫిబ్రవరి 14 వరకూ టెండర్లు ఆహ్వానించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని రూ.237 కోట్లతో కేవలం 18 నెలల్లోనే పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు కొత్త ఎత్తిపోతల పథకాన్ని సైతం వేగంగా పూర్తి చేయడం ద్వారా వరదల్ని నివారించనున్నారు.












Click it and Unblock the Notifications