ఏపీలో ఆటో డ్రైవర్ల యాప్ పై కసరత్తు..! ఈ ఆప్షన్స్ ఇస్తారా ?
ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని తాజాగా అమల్లోకి తెచ్చంది. ఇది విజయవంతంగా అమలవుతోంది. దీంతో ఆటో డ్రైవర్లకు గిరాకీలు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ల కోసం తాజాగా ఏడాదికి 15 వేలు ఇచ్చే మరో కొత్త పథకం అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్ల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏటా ఇచ్చే సాయంతో పాటు ఈ నిర్ణయం వారికి ఉపయోగపడనుంది.
ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15 వేలు ఇచ్చినా వారికి ఇది సరిపోదనే చర్చ జరుగుతున్న వేళ గిరాకీలు పెంచేందుకు టెక్నాలజీని వాడుకుంటామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇందులో భాగంగా ఆటో డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో మొబైల్ యాప్ తీసుకొస్తామని ప్రకటించారు. ఈ యాప్ ద్వారా బుకింగ్స్ చేసుకునేందుకు ప్రయాణికులకు అవకాశం కల్పిస్తామన్నారు. దీనిపై అధికారులు కసరత్తు ప్రారంభించారు.

ఇప్పటికే ఓలా, ఉబెర్ యాప్స్ లో కస్టమర్లు ఆటోలు, కార్లు బుక్ చేసుకునేందుకు అవకాశం ఉంది. దీని తరహాలోనే ఇప్పుడు ఆటో డ్రైవర్లు, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం కొత్త యాప్ తీసుకురాబోతున్నారు. అయితే ఇందులో రిజిస్ట్రర్ చేయించుకోవడాన్ని తప్పనిసరి చేయకూడదని, ఆ ఆప్షన్ వారికే ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అంటే ఆటో డ్రైవర్లను బలవంతంగా ఈ యాప్ లో రిజిస్టర్ చేయించరన్నమాట.

ఆటో డ్రైవర్ల కోసం తెచ్చే యాప్ ఎలాగో ప్రభుత్వమే నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టి దీని నిర్వహణ ఖర్చులు, కాల్ సెంటర్ పెడితే దాని ఖర్చులు ఇలా ప్రభుత్వంపై భారం పడటం ఖాయం. కాబట్టి ఈ యాప్ లో రిజిస్టర్ అయి బుకింగ్స్ తెచ్చుకోవాలంటే కనీస ఛార్జీలు పెట్టాలన్న చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వ యాప్ లో ఆటో డ్రైవర్లకు ఛార్జీలు పెడితే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీనిపైనా చర్చిస్తున్నట్లు సమాచారం. దీంతో యాప్ ను ఆటో డ్రైవర్లకు ఉచితంగా రిజిస్టర్ చేసుకుని, వాడుకునేలా ఇవ్వొచ్చని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications