అమరావతి రైతులకు సంక్రాంతి కానుక విడుదల..!
అమరావతి రాజధాని నిర్మాణంపై వేగంగా అడుగులు వేస్తున్న కూటమి సర్కార్ ఇందుకు భూములు ఇచ్చిన రైతుల విషయంలోనూ అంతే సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. గతంలో రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు తీసుకున్న ప్రభుత్వం.. వారితో చేసుకున్న ఒప్పందం మేరకు ఏటా కౌలు చెల్లించాల్సి ఉంది. అయితే రాజధాని నిర్మాణం ఆలస్యం కావడం, మరోవైపు కౌలు గడువు ముగిసిపోవడంతో తాజాగా దీన్ని మరో ఐదేళ్లకు పొడిగించింది. ఇవాళ వార్షిక కౌలు విడుదల చేసింది.
కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే గత వైసీపీ ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన కౌలు నిధుల్ని విడుదల చేసింది. సంక్రాంతి సందర్భంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో కౌలు మొత్తం జమ చేసింది. బ్యాంకులకు ఈ మేరకు ప్రభుత్వం నుంచి నిధులు బదిలీ కావడంతో రైతుల ఖాతాల్లో వరుసగా జమ చేస్తున్నారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్ల పాటు సంక్రాంతి పండుగే మర్చిపోయిన తమకు కూటమి ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పిందని హర్షం వ్యక్తం చేశారు.

రాజధాని పరిధిలో పింఛన్లు, కౌలు మొత్తాలు చెల్లించేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.255 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో వైసీపీ ప్రభుత్వం పెండింగ్ లో ఉంచిన కౌలు మొత్తంతో పాటు ఈ ఏడాది కౌలు కూడా ఉంది. ఈ రెండు మొత్తాల్ని కలిపి రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. అదే సమయంలో రాజధానిలో భూమి లేని నిరుపేదలకు చెల్లించే పెన్షన్లు కూడా సంక్రాంతి కానుకగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. దీంతో రాజధాని రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో రాజధాని నిర్మాణ పనులు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కౌలు, పెన్షన్ల విడుదల వారితో సంతోషం రెట్టింపు చేసింది.












Click it and Unblock the Notifications