ఏపీ ఉద్యోగులకు తీపి కబురు: డీఏ విడుదలకు సర్కారు ఆమోదం, పీఆర్సీపై అతిగా ఊహించుకోవద్దన్న సజ్జల
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ సర్కారు తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు కొత్త డీఏ విడుదలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు 2019 జూలై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏని విడుల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రభుత్వం గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌కు అనుగుణంగా 2022 జనవరి నుంచి పెంచిన డీఏని జీతానికి జమ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది.

జనవరి జీతంతోపాటు డీఏ కూడా
జనవరి జీతంతో కలిపి మూడు విడతలుగా పెరిగిన డీఏని చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డీఏలో 10 శాతాన్ని ప్రాన్ ఖాతాలకు, మిగితా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతాలకు చెల్లించనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. జడ్పీ, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలు, అన్ని ఎయిడెడ్ సంస్థలు, విశ్వవిద్యాలయాల టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా డీఏ పెంపు వర్తిస్తుందని ఆర్థిక స్పష్టం చేసింది.

పీఆర్సీ అంశంపై సీఎం జగన్ కీలక సమావేశం
ఇది ఇలావుండగా, పీఆర్సీ అంశాలపై అధికారుల కమిటీతో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశం ముగిసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ సహా రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు రావత్, శశిభూషణ్ కుమార్, సత్యనారాయణలు సమావేశానికి హాజరయ్యారు. ఉద్యోగ సంఘాల డిమాండ్లతోపాటు పీఆర్సీపై సమావేశంలో కీలకంగా చర్చించారు.

డిసెంబర్‌లోగా పీఆర్సీ అంశం కొలిక్కి..: సజ్జల
సీఎంతో సమావేశం అనంతరం సజ్జల మీడియాతో మాట్లాడారు. సెంట్రల్ పీఆర్సీ కమిషన్ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ఉద్యోగుల జీతాలు కొంత మేర తగ్గుతున్నాయని గుర్తించామన్నారు. మధ్యంతర భృతి 27 శాతం కంటే తగ్గకుండా కొంత మేర పెరిగేట్టు మళ్లీ కసరత్తు చేయాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారని సజ్జల తెలిపారు. మంగళ, బుధవారాల్లో అధికారులు ఈ విషయంపై కసరత్తులు చేసి ఉద్యోగ సంఘాలతో చర్చించి ఆయా అంశాలను సీఎంకు వివరిస్తారని తెలిపారు. డిసెంబర్ నెలాఖరుకు మొత్తం ప్రక్రియ ఓ కొలిక్కి వస్తుందని భావిస్తున్నామన్నారు

అతిగా ఊహించుకోవద్దని ఉద్యోగులకు సజ్జల
ఆ తర్వాతే పీఆర్సీ ప్రకటన ఉంటుందని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో ఐఆర్ ఇవ్వలేదని, ఆ రాష్ట్ర ప్రభుత్వం నేరుగా పీఆర్సీ ప్రకటించిందని సజ్జల తెలిపారు. కరోనా పరిస్థితులు, రాస్ట్ర ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకునే కొత్త పీఆర్సీ ప్రకటన ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ఉద్యోగులు అర్థ చేసుకోవాలని కోరుతున్నామన్నారు. ఉద్యోగులు ఎక్కువ ఊహించుకుని తర్వాత నిరుత్సాహపడే కంటే ముందే వాస్తవాలను గ్రహిస్తే మంచిదని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications