AP Sand Policy: ఏపీలో ఇసుక అమ్మకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు-మార్గదర్శకాలివే..!
ఏపీలో భవన నిర్మాణాల కోసం ఇసుక కొనుగోలు చేసేందుకు ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కొత్త ప్రభుత్వంలో ఉచితంగానే ఇసుకను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా ఇసుక సరఫరా చేసేందుకు వీలుగా ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపింది. కొత్త విధానం వచ్చే వరకూ ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని తెలిపింది. అలాగే పాత ప్రభుత్వ ఇసుక పాలసీలను రద్దు చేసింది.

ఏపీలో ఇసుక అమ్మకాల కోసం ఇవాళ ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం తమ లక్ష్యాలను వివరించింది. సరసమైన ధరలకు ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం, ఇసుక లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడం, ప్రభావవంతమైన నిఘా ద్వారా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టడం, గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్జీటీ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఇసుక అమ్మడం ద్వారా పర్యావరణంపై ప్రభావం పడకుండా చూడటం తమ లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇసుక అమ్మకాల కోసం జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఎస్పీ, జేసీ వంటి అధికారులు ఈ కమిటీలలో సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం ఉన్న డిపోల్లోనే ఇసుకను అందుబాటులో ఉంచుతారు. జలాశయాల్లో పూడిక తొలగింపు, ట్యాంకు బెడ్ల గుర్తింపు చేపడతారు. జలవనరుల శాఖ ఇందుకు కస్టోడియన్ గా ఉంటుంది. జిల్లా ఇసుక కమిటీలు తవ్వకాలు, పంపిణీ కోసం అవసరమైన సిబ్బందిని నియమించుకోవచ్చు.
ర్యాంపుల్లో తవ్వకాలు, లోడింగ్, అన్ లోడింగ్, పాలనా ఖర్చులు, పన్నుల ఆధారంగా జిల్లా కమిటీలు ఇసుక రేట్లను నిర్ణయిస్తారు. ఇందులో ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయం ఉండకూడదు. ఇసుక లభ్యత, ఇతర వివరాల కోసం మైనింగ్ శాఖ వెబ్ సైట్ www.mines.ap.gov.in ను సంప్రదించవచ్చు. డిపోల్లో కొనుగోలు చేసిన ఇసుకను వినియోగదారులు తమ సొంత రవాణా ఏర్పాటు చేసుకుని తీసుకెళ్లొచ్చు. ఇందులో సహకరించేందుకు వాహనాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు.
మైనింగ్ శాఖ ఆన్ లైన్ పర్మిట్లు జారీ చేస్తుంది. అలాగే ఇసుక కొనుగోలుదారులు యూపీఏ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ప్రతీ వినియోగదారుడు రోజుకు గరిష్టంగా 20 టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేయాలి. పరిమితికి మించి స్టాక్ పెట్టడం, ప్రభుత్వం నుంచి తీసుకున్న ఇసుక తిరిగి అమ్మడం, ఇతర రాష్ట్రాలకు తరలింపు నిషేధం. ఇసుక అక్రమాలపై నిఘా కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు చేస్తారు. ట్రాక్టర్ అక్రమ రవాణా చేస్తూ ఓసారి పట్టుబడితే 10 వేలు, రెండోసారి వరకూ జరిమానా విధిస్తారు. 10 టైర్ల లారీ ఓసారి పట్టుబడితే 25 వేలు, రెండోసారి పట్టుబడితే 50 వేల వరకూ జరిమానా ఉంటుంది. 10 టైర్లకు మించిన లారీ ఓసారి పట్టుబడితే 50 వేలు, రెండోసారి అయితే లక్ష వరకూ జరిమానా విధిస్తారు.












Click it and Unblock the Notifications