బెజవాడ వరద బాధితుడ్ని కొట్టిన మహిళా వీఆర్వో- సర్కార్ యాక్షన్..!
విజయవాడలో బుడమేరు వరద ధాటికి వేలాది మంది ఆహారం, తాగునీరు, నిత్యావసరాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వారిని పరామర్శించడానికి వెళ్లిన అధికార పార్టీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులపై వారు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ ఓ అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. నగరంలో జరుగుతున్న వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ మహిళా వీఆర్వో తనని ప్రశ్నించిన బాధితుడి చెంప పగులగొట్టారు.
మంచినీరు, ఆహారం తమ వీధిలోకి రాలేదని ప్రశ్నించినందుకు వీఆర్వో జయలక్ష్మి ఓ స్ధానికుడి చెంప పగలగొట్టారు. అక్కడితో ఆగకుండా పోలీసులు ముందే బాధితుడిని దుర్భాషలాడారు. పైగా నన్నే ప్రశ్నిస్తావా? అంటూ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని అధికారులకు ఫిర్యాదు కూడా చేసారు. దీంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఉన్నతాధికారులు ఈ విషయంపై స్పందించే లోపే స్దానికులు ఆమెను చుట్టుముట్టారు. కనీస అవసరాల కోసం ప్రశ్నిస్తే కొడతారా అంటూ ఎదురుతిరిగారు.
దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఆమెను తీసుకెళ్లారు.

అయితే ప్రభుత్వం ఈ వ్యవహారంపై తీవ్రంగా స్పందించింది. వరద బాధితులు తమ ఇబ్బందుల దృష్ట్యా ఏదైనా మాట్లాడినా సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు స్వయంగా చెప్తున్నా ఇలా బాధితులపై దాడికి దిగడం ఏంటనే విమర్శలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన స్పందించారు. వీఆర్వో జయలక్ష్మిని విధుల నుంచి తప్పించడంతో పాటు షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. బాధితులతో సంయమనంగా ఉండాలని స్వయంగా చంద్రబాబు చెప్తున్నా ఇలా దాడికి దిగడంపై వివరణ ఇవ్వాలని సూచించారు.












Click it and Unblock the Notifications