జనం మధ్యకు జగన్! పులివెందుల టూర్ షెడ్యూల్ ఇదే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత గడ్డపై పొలిటికల్ యాక్షన్ ప్లాన్‌కు సిద్ధమయ్యారు. రేపటి (జూన్ 23) నుంచి మూడు రోజుల పాటు ఆయన పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఎస్ఐఆర్, స్థానిక సంస్థల ఎన్నికలపై.. స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసేందుకు, అలాగే క్యాడర్‌లో నూతన ఉత్సాహాన్ని నింపేందుకు వైఎస్ జగన్ పులివెందుల వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన బెంగళూరు నుంచి నేరుగా పులివెందుల చేరుకోనున్నారు.
వైఎస్ జగన్ ఈ పర్యటనలో 'ప్రజా దర్బార్'ను నిర్వహించబోతున్నారు. బుధవారం (జూన్ 24) మధ్యాహ్నం నుంచి పులివెందులలోని తన క్యాంప్ కార్యాలయంలో ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్వయంగా తెలుసుకోవడంతో పాటు, తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో పార్టీ శ్రేణులకు గట్టి భరోసా కల్పించేందుకు జగన్ ఈ వేదికను ఉపయోగించుకోనున్నారు. అధినేతను కలిసేందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి భారీగా జనం తరలివచ్చే అవకాశం ఉంది.

భూమయ్యగారిపల్లిలో లక్ష్మీనరసింహ స్వామి దర్శనం..
రాజకీయ కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ వైఎస్ జగన్ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా 24వ తేదీ ఉదయం వేముల మండలం భూమయ్యగారిపల్లిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని ఆయన సందర్శించనున్నారు. వైఎస్ జగన్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆలయ అభివృద్ధి కోసం కోటిన్నర రూపాయలకు పైగా నిధులను మంజూరు చేశారు. దీనికి తోడు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నిధులు, పాడా (PADA) నిధులు, దాతల విరాళాలు అన్నీ కలుపుకుని దాదాపు రూ. 2.5 కోట్లతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా పునఃప్రతిష్టించారు.
ఆలయ పునఃప్రతిష్టా మహోత్సవాల నేపథ్యంలో వైఎస్ జగన్ అక్కడ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం తిరిగి పులివెందుల క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు.
25న తిరుగు పయనం..
రెండు రోజుల పాటు స్థానిక నేతలు, ప్రజలతో బిజీబిజీగా గడపనున్న వైఎస్ఆర్సీపీ అధినేత.. తన పర్యటన ముగించుకుని 25వ తేదీ ఉదయం పులివెందుల నుంచి తిరుగు పయనం కానున్నారు. లోకల్ లీడర్లతో వన్-టు-వన్ సమావేశాలు కూడా జరిపే ఛాన్స్ ఉండటంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో ఈ టూర్ కొత్త జోష్ తెస్తోందని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications