ఏపీలో ఉద్యోగుల సెలవులపై ఆంక్షలు! కీలక కారణమిదే..!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓవైపు సార్వత్రిక ఎన్నికలు, మరోవైపు సంక్షేమ పథకాల్ని లబ్దిదారులకు కచ్చితంగా అందించాల్సి పరిస్దితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది.
ఐదేళ్ల పాలన ఓ ఎత్తు, ఎన్నికల సమయం ఓ ఎత్తుగా మారిపోతున్న పరిస్ధితుల్లో ఎక్కడ తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగుల సెలవుల విషయంలో ఆంక్షలు విధిస్తోంది.

రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వాతావరణం వచ్చేసింది. మరో 20 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడం ఖాయం. ఈ దశలో రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పక్కాగా పంపిణీ జరగాలంటే అధికారులు, ఇతర సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాల్సి ఉంటుంది. లేకపోతే ప్రభుత్వానికి ఎన్నికల వేళ చెడ్డపేరు తప్పదు. అసలే విపక్షాలు ఏ చిన్న అవకాశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నాయి. ఈ సమయంలో ఉద్యోగులు సాధారణ పరిస్ధితుల తరహాలో సెలవులు పెడితే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వం భావిస్తోంది.
దీంతో ఉద్యోగుల సెలవుల విషయంలో విచక్షణతో వ్యవహరించాలంటూ సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి రేవు ముత్యాల రాజు అన్ని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఆర్దిక సంవత్సరం ముగింపు దశకు వచ్చేసింది. అన్ని శాఖల అధికారులు, విభాగాధిపతులకు ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాలు ఉన్నాయి. వీటిని అందుకోవాలంటే కచ్చితంగా పూర్తిస్ధాయిలో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే మార్చి నెలలో ప్రభుత్వం తరఫున పేదల ఇళ్ల స్ధలాల రిజిస్ట్రేషన్లతో పాటు విద్యా దీవెన, రైతు భరోసా, ఇన్ పుట్ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత వంటి పథకాలు అమలు కావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సెలవుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలంటూ విభాగాధిపతులకు ఆదేశాలు పంపారు. ముఖ్యంగా ఉద్యోగుల సెలవుల ప్రభావం ప్రభుత్వ శాఖల పనితీరుపై పడకుండా చూసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. ఏ పనీ ఆగకుండా తగినంత మంది సిబ్బంది కార్యాలయాల్లో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని ఆదేశాలు వెళ్లాయి.












Click it and Unblock the Notifications