కార్పోరేట్ కు దీటుగా ఏపీ సర్కారీ స్కూల్స్ ; ఎక్కడా రాజీ పడలేదన్న సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు పాఠశాలలను ప్రారంభించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా మూతపడిన పాఠశాలలను నేటి నుంచి పునఃప్రారంభం చేసిన నేపథ్యంలో ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మన బడి, నాడు నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లాలో నూతనంగా ముస్తాబైన స్కూల్స్ ను విద్యార్థులకు సీఎం జగన్ అంకితం చేశారు. జగనన్న విద్యా కానుక కిట్లను విద్యార్థులకు పంపిణీ చేసిన జగన్ ఈ సందర్భంగా మాట్లాడారు.

మొదటి విడత నాడు-నేడు పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేసిన జగన్
పేద విద్యార్థుల జీవితాలలో మార్పు రావాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు సీఎం జగన్. రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కరోనా నిబంధనలు పాటిస్తున్నామని, పాజిటివిటీ రేటు 10% కంటే తక్కువగా ఉన్న చోట స్కూల్స్ తెరిచామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం పోతవరం గ్రామంలో మొదటి విడత నాడు-నేడు ద్వారా అధునాతనంగా రూపుదిద్దుకున్న పాఠశాలలను విద్యార్థులకు అంకితం చేసిన జగన్, జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు పుస్తకాలతో సహా వారికి కావలసిన అన్ని వస్తువులను అందజేస్తున్నామని వెల్లడించారు.
జగనన్న విద్యా కానుక ద్వారా 42 లక్షల విద్యార్థులకు లబ్ది
కరోనా దృష్ట్యా తరగతి గదులలో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులను ఉంచకూడదని పేర్కొన్నారు. ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తామని సీఎం జగన్ తెలిపారు. విద్యా కానుక కిట్లలో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడలేదని పేర్కొన్నారు. జగనన్న విద్య కానుక పథకం కింద ఏడాదికి 1380 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నామని సీఎం జగన్ వెల్లడించారు. దీంతో 42 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని జగన్ తెలిపారు. ఇక ఈ రోజు మూడు ముఖ్యమైన పనులకు శ్రీకారం చుట్టామని తెలిపిన జగన్ ఒకటి స్కూల్స్ పునః ప్రారంభించడం అని వెల్లడించారు.

రెండో విడత నాడు - నేడు పనులకు నేటి నుండి శ్రీకారం చుట్టిన జగన్
రెండవది మొదటి విడత నాడు-నేడు ద్వారా రూపురేఖలు మార్చిన స్కూల్స్ ను విద్యార్థులకు అంకితం చేసి, నేటి నుంచి రెండో విడత పనులకు శ్రీకారం చుడుతున్నామని, ఇదే సమయంలో జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు కావాల్సిన అన్ని వస్తువులు సమకూర్చామని సీఎం జగన్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్వో, ఐసీఎంఆర్ సూచనల మేరకు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూల్స్ తెరిచామని సీఎం జగన్ వెల్లడించారు. టీచర్లందరికీ టీకాలు ఇచ్చామని స్పష్టం చేశారు . కార్పొరేట్ స్కూళ్ళకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నాడు నేడు ద్వారా తీర్చిదిద్దుతున్నామని సీఎం జగన్ వెల్లడించారు.
ఉన్నత ప్రమాణాలతో విద్య అందించటమే సీఎం జగన్ లక్ష్యం
గతంతో పోలిస్తే విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలలో గణనీయంగా పెరిగింది అన్నారు సీఎం జగన్. పిల్లలకు ఇచ్చే నిజమైన ఆస్తి చదువే అన్న జగన్ విద్యావ్యవస్థలో ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించడానికి తగిన కసరత్తు జరుగుతోందని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పాలనలో తనదైన మార్క్ చూపించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి పాఠశాలల రూపురేఖలు మార్చేసి కార్పోరేట్ స్కూల్స్ లో చదువుతున్న ఫీల్ కలిగించేలా గవర్నమెంట్ స్కూల్స్ ను మార్చేశారు.
నాడు నేడు ద్వారా 15,715 స్కూల్స్ కు కొత్తకళ
రాష్ట్ర వ్యాప్తంగా 44,512 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడానికి రంగంలోకి దిగిన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మొదటి విడతగా 15,715 పాఠశాలలను అధునాతనంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ స్థాయిలో రూపురేఖలు మార్చేశారు. మొత్తం 15,715 పాఠశాలలకు 3,585 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేశారు. పాఠశాలల భవనాలను రిపేర్ చేయించడమే కాకుండా, ఆధునికత ఉట్టిపడేలా, విద్యార్థులకు ఉపయుక్తంగా ఉండేలా చాలా అందంగా తీర్చిదిద్దారు. ప్రభుత్వ పాఠశాలలను సైతం సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.












Click it and Unblock the Notifications