సీఎస్ విజయానంద్ విషయంలో కేంద్రానికి లేఖ..!!
సీనియర్ ఐఎఎస్ అధికారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నెలాఖరుతో ఆయన పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఆయన సర్వీసును పొడిగించాలని కేంద్రాన్ని కోరనున్నారు. ఈ మేరకు నేడో, రేపో కేంద ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం. గరిష్ఠంగా మరో మూడు నెలల పాటు పొడిగింపు కోరవచ్చు.
1992 బ్యాచ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఐఏఎస్ అధికారి.. విజయానంద్. 2014లో విభజన అనంతరం ఆయనను ఏపీకి కేటాయించింది డీఓపీటీ. గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలను స్వీకరించారు. 11 నెలలుగా ఈ హోదాలో కొనసాగుతున్నారు. ఈ నెలాఖరున ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది.

అంతకుముందు ట్రాన్స్ కో సీఎండీ, విద్యుత్, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి పలు ప్రాధాన్యత గల విభాగాలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. గుంటూరు జిల్లాలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.
ప్రారంభంలో ప్రకాశం జిల్లాలో సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. అనంతరం కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా, ఆపరేషన్స్ అండ్ డెవలప్‌మెంట్ డెప్యూటీ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
ఏపీ ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీ జెన్కో, సదరన్ డిస్కమ్ సీఎండీ పనిచేశారు. గ్రామీణ విద్యుదీకరణ సంస్థలో డైరెక్టర్‌గా ఆయన జాతీయ స్థాయిలో సేవలందించారు. ఆయనకు ఉన్న సుదీర్ఘ అనుభవాన్ని మరికొంతకాలం పాటు వినియోగించుకోవాలని చంద్రబాబు భావిస్తోన్నారు. ఈ క్రమంలో ఆయన సర్వీసును మరో మూడు నెలల పాటు పొడిగించేలా కేంద్రానికి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ చంద్రబాబు మార్పు వైపు మొగ్గు విజయానంద్ తర్వాత జీ సాయి ప్రసాద్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యే అవకాశం ఉంది. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆయన. ప్రస్తుతం జలవనరుల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పని చేస్తోన్నారు. నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ తర్వాత సాయి ప్రసాద్‌ను నియమిస్తారని గతంలో ఊహాగానాలు వచ్చినా, చంద్రబాబు విజయానంద్‌ను ఎంపిక చేశారు. సాయి ప్రసాద్ 2026 జూన్ వరకు సర్వీసులో ఉంటారు.












Click it and Unblock the Notifications