Anna Canteens: అన్న క్యాంటీన్ల రోజువారీ ఖర్చెంతో తెలుసా ? ఖజానాపై సబ్సిడీ భారమిదే..!
ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్న క్యాంటీన్లను మధ్యలో వైసీపీ ప్రభుత్వం మూసేసింది. వాటిని ఇప్పుడు తిరిగి ప్రారంభించడంతో పాటు కొత్తగా మరికొన్ని క్యాంటీన్లను కూడా కూటమి సర్కార్ అందుబాటులోకి తెస్తోంది. తాజాగా సీఎం చంద్రబాబు గుడివాడలో ఇలా మొదటి అన్న క్యాంటీన్ ను పునఃప్రారంభించగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో పునఃప్రారంభోత్సవాలు చేస్తున్నారు. హరేరామా ట్రస్ట్ వీటికి ఆహారం సబ్సిడీపై సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై పడే భారమెంతో ఓసారి చూద్దాం..
ప్రభుత్వ తాజా అంచనాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్లు 100. వచ్చే నెలాఖరు కల్లా మరో 103 క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తారు. ప్రస్తుతం పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్లకు రోజువారీ అవుతున్న ఖర్చు అక్షరాలా రూ.78.75 లక్షలు.నెలకు రూ.19.68 కోట్లు. ఏడాదికి రూ.236.25 కోట్లు. వచ్చేనెలలో మరో 103 క్యాంటీన్లు వీటికి అదనంగా చేరబోతున్నాయి. వాటికి కూడా కలుపుకుంటే మొత్తం 203 క్యాంటీన్లకు రోజుకు రూ.1.59 కోట్లు, నెలకు రూ.39.96 కోట్లు, ఏడాదికి రూ.479 కోట్ల ఖర్చు కానుంది.

మరోవైపు గతంలోనూ సబ్సిడీకే రూ.5 కు అన్న క్యాంటీన్లలో ప్రభుత్వం అల్పాహారాన్ని, భోజనాన్ని పేదలకు అందించింది. అయితే అప్పట్లో ఇచ్చిన సబ్సిడీతో పోలిస్తే ఇప్పుడు భారం మరింత పెరిగింది. అప్పట్లో ఒక్కో ప్లేట్ టిఫిన్ పై సబ్సిడీ భారం 13 రూపాయలు ఉండగా.. అది ఇప్పుడు 17కు చేరింది. ప్లేట్ భోజనంపై సబ్సిడీ అప్పట్లో రూ.22.50 ఉండగా.. ఇప్పుడు అది కాస్తా 29 రూపాయలకు చేరింది. దీంతో మొత్తంగా చూస్తే అప్పట్లో ఒక వ్యక్తికి మూడు పూటలా తింటే 58 రూపాయల సబ్సిడీ ఇస్తే ఇప్పుడు రూ.75 సబ్సిడీ కింద ఇవ్వాల్సిన పరిస్ధితి.












Click it and Unblock the Notifications