Volunteers: ఆ వాలంటీర్ల సంగతేంటి ? ఏపీ సర్కార్ అభిప్రాయం కోరిన హైకోర్టు..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎన్నికలకు ముందు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి జీతాలను కూడా రెట్టింపు చేస్తామని చెప్పిన కూటమి నేతలు ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వారిని పెన్షన్ల పంపిణీ నుంచి తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో వాలంటీర్ల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం కోరుతూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సంచలనం రేపుతున్నాయి.

రాష్ట్రంలో గత ప్రభుత్వం నియమించిన వాలంటీర్లలో దాదాపు 60 వేల మందికి పైగా ఎన్నికల నోటిఫికేషన్ తర్వాత రాజీనామాలు చేసి అధికార వైసీపీకి మద్దతుగా ప్రచారంలోకి వచ్చేశారు. వైసీపీ నేతల ఒత్తిడితోనే ఆ రాజీనామాలు చేశామని ఇప్పుడు వారు చెప్తున్నారు. గతంలో ఎన్నికల పోలింగ్ సమయానికి దాదాపు లక్ష మంది వాలంటీర్లు ఇలా రాజీనామాలు చేశారు. దీంతో వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామాలు ఆమోదించవద్దంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు.. ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
కానీ తాజాగా మరోసారి వాలంటీర్ల రాజీనామాల ఆమోదం వ్యవహారంపై విచారణ జరిపిన హైకోర్టు.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఈసీ తమ అభిప్రాయాలు తెలుపుతూ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో ఏం చెప్పబోతోందన్నది కీలకంగా మారింది. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే రాజీనామాలు చేసిన వాలంటీర్లతో వైసీపీ నేతలపై కేసులు పెట్టిస్తున్న కూటమి సర్కార్.. వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అదే సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి వారిని తప్పించింది. ఈ నేపథ్యంలో హైకోర్టులో ప్రభుత్వం తన స్టాండ్ చెప్పక తప్పని పరిస్ధితి ఎదురైంది. ఈ మేరకు త్వరలో ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయనుంది.












Click it and Unblock the Notifications