విద్యా కానుక కిట్లపై కూటమి సర్కార్ కీలక నిర్ణయం..?
ఏపీలో గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్య కానుక పేరుతో పాఠశాలలకు వెళ్లే విద్యార్ధులకు యూనిఫామ్, బూట్లు, ఇతర సామాగ్రి ఏటా ఉచితంగా పంపిణీ చేసింది. ప్రతీ సంవత్సరం స్కూల్లు తెరిచిన తర్వాత విద్యార్ధులకు ఈ కిట్ ను అందజేసే వారు. ఇందులో అక్రమాలు జరుగుతున్నాయని, భారీగా ప్రజాధనం వృథా అవుతోందని, నాసిరకం కిట్లను పంపిణీ చేస్తున్నారని విపక్షాలు గగ్గోలు పెట్టినా వైసీపీ సర్కార్ మాత్రం పట్టించుకోలేదు.
కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దీనిపై కూటమి సర్కార్ ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి. అయితే ఇప్పటికే విద్య కానుక పంపిణీ వ్యవహారంపై గుర్రుగా ఉన్న టీడీపీ నేతలు దీనిపై విచారణ కోరుతున్నారు. అదే సమయంలో ఇప్పటికే కొనుగోలు చేసిన విద్యాకానుక కిట్లను ఏం చేయాలనే దానిపై అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. దీంతో ఈసారికి కొనుగోలు చేసిన కిట్లను వృథా చేయకుండా యథావిధిగా పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

మాజీ సీఎం జగన్ పేరుతో ఉన్న విద్య కానుక కిట్లను పంపిణీ చేస్తే కొత్త ప్రభుత్వ ఏర్పాటు వేళ జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో కిట్లను వాడకపోతే లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా కాక తప్పదు. దీంతో ఈసారికి కిట్లను ఇచ్చేస్తేనే బెటర్ అన్న ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా ప్రభుత్వ ప్రమాణస్వీకారం తర్వాత దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో గతంలో జరిగిన విద్య కానుక కిట్ల కొనుగోళ్లపై విచారణ కూడా నిర్వహించనున్నారు.












Click it and Unblock the Notifications