AP Government కీలక నిర్ణయం- పంచాయతీకో ఐసోలేషన్ కేంద్రం- కారణమిదే
దేశవ్యాప్తంగా కోవిడ్ రెండో దశ ప్రభావం చూపుతున్న వేళ ఏపీలోనూ కేసుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది. పగటి పూట కర్ఫ్యూ విదిస్తున్నా ప్రతి రోజూ 20 వేల పైచిలుకు కేసులు తప్పడం లేదు. అదే సమయంలో గ్రామాల్లో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందన్న అంచనాలున్నాయి. దీంతో ఇకపై గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు ఏపీ సర్కార్ సిద్దమైంది.
ఏపీలోని ప్రతీ గ్రామ పంచాయతీలో ఇకపై కరోనా ఐసోలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించారు. ఇందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. గ్రామాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటం, తాజాగా ఫీవర్ సర్వేలోనూ గ్రామాల్లో జ్వరాల కట్టడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

ప్రతీ గ్రామ పంచాయతీలో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వసతి గృహాలు, ఇతర భవనాల్లో కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాల్ని గ్రామ కార్యదర్శులు పరిశీలిస్తారు. అనంతరం ప్రభుత్వం సర్పంచ్‌లతో వీటిని నిర్వహించబోతోంది.
అయితే ఈ ఐసోలేషన్ కేంద్రాల నిర్వహణ బాథ్యతను మాత్రం సర్పంచ్‌లకే అప్పగించనున్నారు. కేసుల సంఖ్య ఆధారంగా బెడ్ల ఏర్పాటు చేస్తామని పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటించారు. స్త్రీ, పురుషులకు వేర్వేరుగా ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications