పెన్షన్ల ప్రక్షాళన దిశగా కూటమి సర్కార్? వీటిపైనే ఫోకస్..!
ఏపీలో కూటమి సర్కార్ ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద ఈ నెల 1వ తేదీన ఠంచనుగా లబ్దిదారులకు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసింది. అంతే కాదు సచివాలయ సిబ్బందితో పెన్షన్ల పంపిణీ చేసి వాలంటీర్లు లేకుండా ఈ ప్రక్రియ అసాధ్యం అన్న భ్రమల్ని కూడా పటాపంచలు చేసింది. ఇప్పుడు ఇదే జోష్ లో మరో కీలక నిర్ణయం దిశగా అడుగులేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అంతర్గతంగా సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ప్రస్తుతం 65 లక్షలకు పైగా పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో వృద్ధాప్య పెన్షన్లతో పాటు వితంతు, దివ్యాంగుల, ఇతర పెన్షన్లు ఉన్నాయి. గత వైసీపీ సర్కార్ వీరిలో అనర్హులకు కూడా అవకాశం ఇచ్చింది. దీంతో వీరిని గుర్తించి తొలగించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలో పంపిణీ అవుతున్న పెన్షన్లలో పలువురు నకిలీ లబ్దిదారులు కూడా తీసుకుంటున్నట్లు ప్రభుత్వానికి సమాచారం ఉంది. దాదాపు 2.5 లక్షల మంది ఇలా నకీలీ లబ్దిదారులు ఉన్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా ఆధార్ కార్డులో వయస్సు మార్చుకుని వృద్ధాప్య పెన్షన్లు తీసుకోవడం, దివ్యాంగులు కాకపోయినా నకిలీ ధృవపత్రాలతో తీసుకోవడం, ఒంటరి మహిళ కాకపోయినా వితంతు పెన్షన్లు తీసుకోవడం వంటి అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు సైతం సామాజిక పింఛన్లు తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. ఈ ఫిర్యాదులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన వెంటనే విచారణ జరిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇది పూర్తయితే నకిలీల ఏరివేత ప్రారంభం కానుంది.












Click it and Unblock the Notifications