ఏపీలో ఉచిత బస్సుపై కీలక ప్రకటన..! త్వరలో కార్డులు-తిరుమలకూ..!
ఏపీలో కూటమి సర్కార్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 15న ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ పథకం అమలు విషయంలో ఇప్పటికే ప్రభుత్వం మంచి మార్కులే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో పథకం అమల్లో త్వరలో పలు మార్పులు కూడా చేసేందుకు సిద్దమవుతోంది. ఈ వివరాలను ఇవాళ రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
కూటమి ప్రభుత్వం మహిళామూర్తులకు సూపర్ సిక్స్ పథకం లో భాగంగా అందించిన మరో కానుక స్త్రీ శక్తి సూపర్ సక్సెస్ అయిందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం అమలుకు ముందే పక్క రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఇక్కడ పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. పథకం అమలు తీరులో చిన్న చిన్న లోటుపాట్లు సహజమని, ఒడిదుడుకులను తట్టుకుని సద్విమర్శలను పరిగణనలోకి తీసుకుని దీన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందన్నారు.

స్త్రీశక్తి పథకం ప్రారంభమైన తొలి ఆరు రోజుల్లో 65 లక్షల మందికి పైగా మహిళలు ఫ్రీ బస్సు సేవలను సద్వినియోగం చేసుకున్నారని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఆర్టీసీకి ప్రభుత్వం సబ్సిడీ చెల్లిస్తుందన్నారు. ఫ్రీ బస్సు పథకం ప్రారంభానికి ముందే బస్ స్టేషన్లు, బస్ షెల్టర్లలలో రద్దీకి అనుగుణంగా అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. దీంతో ఎలాంటి సమస్యలు రాలేదన్నారు. మరోవైపు ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ఫ్రీ బస్సు లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందించే యోచనలో ఉన్నట్లు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. అలాగే ప్రతి బస్సులో సీసీ కెమెరాలు, కండెక్టర్ల కు బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.

ప్రభుత్వం త్వరలో 750 ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురానుందని, మరో నాలుగేళ్లలో 2500కు పైగా నూతన బస్సులను కొనుగోలు చేయనున్నామని మంత్రి తెలిపారు. కొత్తగా కొనుగోలు చేసే బస్సులన్నీ ఎలక్ట్రికల్ బస్సులే అని, దాంతో రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా పల్లె వెలుగు బస్సులు సైతం ఏసీ బస్సులే ఉంటాయన్నారు. ఘాట్ రోడ్ ప్రాంతాల్లో సైతం ఫ్రీ బస్సు అమలు చేస్తున్నామని, రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో వస్తున్న సమస్యల్ని వారం రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తిరుమలకు కూడా ఫ్రీ బస్సు అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామన్నారు.












Click it and Unblock the Notifications