జగన్ తో సెల్ఫీ తెచ్చిన ముప్పు-మహిళా కానిస్టేబుల్ పై సర్కార్ యాక్షన్..!
ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయినా వైఎస్ జగన్ కు కొన్ని వర్గాల్లో క్రేజ్ మాత్రం ఇంకా ఏమాత్రం తగ్గలేదు. తాజాగా గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించేందుకు వచ్చిన వైఎస్ జగన్ తో సెల్పీ దిగేందుకు చాలా మంది పోటీ పడ్డారు. ఇందులో ఓ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు. జగన్ ప్రెస్ మీట్ కు సిద్ధమవుతున్న సమయంలో అదే పనిగా ఆయన వద్దకు వచ్చిన ఓ మహిళా కానిస్టేబుల్ అడిగి మరీ సెల్ఫీ తీసుకున్నారు.

గుంటూరు జైలుకు వైఎస్ జగన్ వచ్చాక లోపల ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్ ను పరామర్శించారు. అనంతరం బయటికి వచ్చాక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సమయంలో ఆయేషా బాను అనే కానిస్టేబుల్ తన కుమార్తెతో జగన్ వద్దకు వచ్చి ఒక్క సెల్ఫీ తీసుకుంటానని అడిగారు. అంతటితో ఆగకుండా తమను ఆశీర్వదించమని కూడా కోరారు. దీంతో జగన్ కాదనకుండా వారికి సెల్ఫీ ఇవ్వడంతో పాటు ఆశీర్వదించారు. ఇది అధికార కూటమి శ్రేణులకు నచ్చలేదు.
ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి జగన్ తో ఎలా సెల్ఫీ తీసుకుంటారంటూ వారు ఫిర్యాదులు చేయడం మొదలుపెట్టారు. దీంతో ప్రభుత్వం కూడా స్పందించింది. జగన్ తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. త్వరలోనే కానిస్టేబుల్ ఆయేషా బానుకు ఛార్జిమెమో జారీ చేస్తామని జైలర్ రవిబాబు వెల్లడించారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా ఓ కమిటీ వేసి చర్యలు తీసుకుంటామన్నారు. అదే జరిగితే ఇది మరో వివాదానికి దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications