ఏపీ ఉచిత బస్సు పథకం- 6 నెలల్లో ఆ సమస్యకు చెక్-ఆటో డ్రైవర్ల పథకం..!
ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చి రెండు వారాలవుతోంది. ఈ రెండు వారాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఈ పథకం సాగిపోతోంది. అయితే ఈ పథకం కారణంగా తలెత్తుతున్న రెండు సమస్యలను పరిష్కరించే విషయంలో రవాణామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు. ఉచిత బస్సు పథకానికి ఇప్పటివరకూ 90 కోట్లు ఖర్చయిందని, త్వరలో మహిళలకు స్మార్ట్ కార్డులు ఇస్తామని ప్రకటించారు.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అంచనాలకు మించి ప్రయాణాలు సాగిస్తున్నారు. దీని వల్ల సహజంగానే రద్దీ పెరుగుతోంది. అలాగే పురుషులు, వృద్ధులు, బాలురకు పలు చోట్ల బస్సులు ఎక్కే పరిస్ధితి లేకుండా పోతోంది. దీంతో ఆయా వర్గాలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అలాగే ఉచిత బస్సు పథకం అమలు వల్ల తమ ఆదాయానికి గండిపడుతుందని ఆటో డ్రైవర్లు ఆందోళనలో ఉన్నారు.

ఈ రెండు సమస్యలపై ఇవాళ రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం సజావుగా సాగిపోతోందని, అయితే ఈ పథకం మరింత మెరుగ్గా అమలు చేసేందుకు వీలుగా కొత్త బస్సుల్ని ఆరు నెలల్లో అందుబాటులోకి తెస్తామని ఆయన వెల్లడించారు. పల్లెల నుంచి పట్టణాలకు ఏసీ బస్సులు నడపాలనేది సీఎం చంద్రబాబు ఆలోచన అని మంత్రి మండిపల్లి తెలిపారు.

మరోవైపు ఉచిత బస్సు పథకం కారణంగా ఆదాయం కోల్పోతున్న ఆటో డ్రైవర్లపైనా స్పందించారు. వారి కోసం కొత్త పథకం అమల్లోకి తీసుకు వస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు, మంత్రులు ఆటో డ్రైవర్ల ఉపాధిపై దెబ్బ పడకుండా కొత్త పథకం అమలుకు కసరత్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి దీన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు మరోసారి మంత్రి మండిపల్లి దీనిపై క్లారిటీ ఇచ్చారు. త్వరలో ఈ పథకం కూడా అమల్లోకి వస్తే ఆటో డ్రైవర్ల సమస్య కూడా తీరబోతోంది.












Click it and Unblock the Notifications