ఏపీలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంపు..! సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు..!
ఏపీలో రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయడంతో పాటు కొత్తగా చేపట్టాల్సిన మార్పులపై సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఇందులో భూముల రిజిస్ట్రేషన్ల విలువల పెంపు, సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల రద్దు వంటివి ఉన్నాయి. వీటికి ఆమోద ముద్ర వేస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరకూ, రిజిస్ట్రేషన్ విలువకూ మధ్య గ్యాప్ ఉందనే చర్చకు వచ్చింది. దీంతో ఈ విలువను సరిచేసేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ విలువను 10 నుంచి 20 శాతం పెంపుకు చంద్రబాబు అంగీకరించారు. దీంతో త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ల విలువ మదించాలి కాబట్టి దీనికి 45 రోజుల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. అనంతరం అధికారులు అందించే రిపోర్టు ఆధారంగా రిజిస్ట్రేషన్ల విలువ పెంపుపై చంద్రబాబు ప్రకటన చేయనున్నారు.
అలాగే వైసీపీ హయాంలో చేపట్టిన సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు పేలవ స్పందన ఉన్నట్లు అధికారులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. రిజిస్టార్ కార్యాలయాలతో పాటు సచివాలయాల్లోనూ రిజిస్ట్రేషన్లు చేపట్టడం వల్ల సాంకేతికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ముఖ్యంగా ప్రజలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లకు ఆసక్తి చూపడం లేదని తెలిపారు. దీంతో సచివాలయాల్లో ఇకపై రిజిస్ట్రేషన్ల రద్దుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. త్వరలో దీనిపై ఉత్తర్వులు వెలువడనున్నాయి. అలాగే ఎంపిక చేసిన రిజిస్టార్ కార్యాలయాల్ని కార్పోరేట్ స్దాయికి తీసుకెళ్లాలన్న వైసీపీ ప్రభుత్వ ప్రతిపాదనకు చంద్రబాబు బ్రేక్ వేశారు.












Click it and Unblock the Notifications