ఈ నెల 14న ఏపీలో పండగలా..
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భారీ కార్యక్రమానికి సన్నద్ధమౌతోంది. ఈ నెల 15వ తేదీన అయిదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించడానికి సన్నాహాలు చేపట్టింది. ఈ విద్యా సంవత్సరం నుంచే అవి అందుబాటులోకి రానున్నాయి.
దీనికోసం వైఎస్ జగన్.. విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విజయనగరంలో కొత్తగా నిర్మించిన వైద్య కళాశాలను ప్రారంభిస్తారు. అక్కడే బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అదే వేదికపై నుంచి రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాలల్లో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీలను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.
రాష్ట్రంలో వైద్య విద్యను అభివృద్ధి పర్చడానికి ప్రతి జిల్లాకు ఓ ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మించాలని వైఎస్ జగన్ సంకల్పించిన విషయం తెలిసిందే. దీనికోసం 8,480 కోట్ల రూపాయల వ్యయంతో 17 కొత్త కాలేజీలు నిర్మిస్తోంది. వీటిలో విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల కళాశాలల నిర్మాణాలు పూర్తయ్యాయి.

ఆయా కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు మొదలు కానున్నాయి. ఈ 5 కాలేజీల్లో ఒక్కో కళాశాలలో 150 చొప్పున 750 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ ద్వారా ఆల్ ఇండియా కోటా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తయింది. కొత్త కాలేజీల్లో 111 ఆలిండియా కోటా సీట్లకు గాను 69 భర్తీ అయ్యాయి.
రాష్ట్ర కోటాకు సంబంధించి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ తొలి విడత కౌన్సెలింగ్ సైతం పూర్తి చేసింది. ఈ కౌన్సెలింగ్‌లో 516 సీట్లు భర్తీ అయ్యాయి. ఇప్పటి వరకు 585 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ నెల 10న ఆల్ ఇండియా కోటా మూడో విడత, రాష్ట్ర కోటా రెండో విడత కౌన్సెలింగ్ జరుగుతాయి. వీటిలో మిగిలిన సీట్లు భర్తీ అవుతాయి.












Click it and Unblock the Notifications