ఏపీలో సచివాలయ ఉద్యోగులకు కీలక బాధ్యత..! ప్రత్యేక యాప్..!
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం మరో కీలక బాధ్యత అప్పగించింది. కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పీ4 కార్యక్రమంలో భాగంగా ఈ బాధ్యతను అప్పగించింది. తాము పనిచేస్తున్న సచివాలయాల పరిధిలోనే ఉద్యోగులకు ఆ బాధ్యత కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. అంతే కాదు సచివాలయ ఉద్యోగులు తమ విధి నిర్వహణలో భాగంగా ఈ బాధ్యత చూడాల్సి ఉంటుందని కూడా పేర్కొంది.
రాష్ట్రంలో కూటమి సర్కార్ పేదరిక నిర్మూలనలో భాగంగా పీ4 పేరుతో ఓ కార్యక్రమం అమలు చేస్తోంది. ఇందులో ధనవంతులైన మార్గదర్శులు.. పేదలైన బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 1.4 లక్షల మంది మార్గదర్శులు ఇప్పటికే 14 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరి మధ్య సమన్వయకర్తలుగా వ్యవహరించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం అప్పగించింది.

స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా చేపడుతున్న పేదరిక నిర్మూలన కోసం పీ4 మార్గదర్శులకూ, బంగారు కుటుంబాలకూ మధ్య సమన్వయం పర్యవేక్షించే బాధ్యతను సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు. ప్రతీ సచివాలయ ఉద్యోగికి తమ సచివాలయం పరిధిలోనే సగటున 3 క్లస్టర్లను కేటాయిస్తారు. ఆయా క్లస్టర్లలోని బంగారు కుటుంబాల బాధ్యత సచివాలయ ఉద్యోగులదే. వారు నిరంతరం ఆయా బంగారు కుటుంబాలతో కాంటాక్ట్ లో ఉంటూ మార్గదర్శులతో వీరిని సమన్వయం చేయాల్సి ఉంటుంది.

బంగారు కుటుంబాలకు మార్గదర్శులు అందించే సాయం సమగ్రంగా అందేలా చూడటం, ఇందులో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకోవడం, బంగారు కుటుంబాల అభివృద్ధిని ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదించడం, జీరో పావర్టీ పీ4 పోర్టల్ ద్వారా ఈ కార్యక్రమం సజావుగా సాగేలా చూడటం వీరి బాధ్యతలు. అలాగే వీరికి ప్రత్యేక యాప్ కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోనే బంగారు కుటుంబాల మ్యాపింగ్, వారికి అందుతున్న సాయంతో పాటు ఇతర వివరాలు నమోదు చేస్తారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని రాష్ట్ర, జిల్లా స్దాయిలో ప్రణాళిక శాఖ పర్యవేక్షించనుంది.












Click it and Unblock the Notifications