ఎన్నికలు జరగని 23 మున్సిపాలిటీలపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం- ఉత్తర్వులు జారీ..!
ఏపీలో 100 పట్టణ స్ధానిక సంస్థల్లో (మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీలు) మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ పూర్తయింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల పోలింగ్ ను నవంబర్ 1న ఖరారు చేశారు. నవంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు కూడా విడుదల చేసేలా ఎస్ఈసీ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే రాష్ట్రంలో మిగిలిన 23 పట్టణ స్థానిక సంస్థల్లో సైతం మున్సిపల్ ఎన్నికల దిశగా ప్రభుత్వం (AP Govt) ఇవాళ కీలక అడుగు వేసింది.
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 100 పట్టణ స్థానిక సంస్థలు కాకుండా మిగిలిన 23 మున్సిపాలిటీలు, కార్పోరేషన్లు, నగర పంచాయతీల్లో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి, అమదాలవలస, రాజాం, భీమవరం, తణుకు, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, తాడిగడప, గుడివాడ, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, కందుకూరు, పొదిలి, అల్లూరు, గూడూరు (నెల్లూరు), కావలి, శ్రీకాళహస్తి, బి.కొత్తకోట ఉన్నాయి. వీటిపై ప్రస్తుతం కోర్టుల్లో కేసులు ఉండటం వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు.

అయితే కోర్టు కేసులు ఉన్నప్పటికీ మిగతా ప్రక్రియ అంతా పూర్తి చేస్తే.. తీర్పు రాగానే వీటిలోనూ ఎన్నికల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం ఓటర్ల గుర్తింపు, రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ చేపడుతోంది. ఇందులో భాగంగా కోర్టు కేసుల్లో ఉన్న 23 మున్సిపాలిటీలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్ల ఖరారు చేసేందుకు ఇంటింటి సర్వే చేపట్టేందుకు వీలుగా మున్సిపల్ శాఖ షెడ్యూల్ కూడా విడుదల చేసింది. ఈ 23 చోట్ల ఐదు రోజుల పాటు ఓటర్ల గుర్తింపు కోసం ఇంటింటి సర్వే కొనసాగనుంది. ఇందులో అక్టోబర్ 25, 26 తేదీల్లో వార్డులవారీగా ఇంటింటి సర్వే నిర్వహించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా ఓటర్లను గుర్తిస్తారు. అనంతరం అక్టోబర్ 27న గుర్తించిన ఓటర్లతో ముసాయిదా జాబితాలను ప్రచురిస్తారు. అక్టోబర్ 28న ఓటర్ల గుర్తింపుపై క్లెయిమ్స్, అభ్యంతరాలను స్వీకరిస్తారు. అక్టోబర్ 29న క్లెయిమ్స్, అభ్యంతరాలపై క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి, తుది జాబితాలను ప్రచురిస్తారు. అనంతరం వీటిలో ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఎస్ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తుంది. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి వీటిలోనూ ఫలితాలను ప్రకటిస్తారు. దీంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు అవుతుంది.













Click it and Unblock the Notifications
