తెలుగు అకాడమీ పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం .. జగన్ సర్కార్ తాజా నిర్ణయంతో కొత్త రచ్చ !!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ పేరును మారుస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుండి తెలుగు అకాడమీ పేరు తెలుగు,సంస్కృత అకాడమీగా మారనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. అకాడమీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ లో నలుగురి నియామకం కూడా చేపట్టింది. తాజా ప్రభుత్వ నిర్ణయం తెలుగు భాషాభిమానులను షాక్ కు గురి చేస్తుంది.

తెలుగు అకాడమీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్
ఇక తెలుగు అకాడమీ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న జగన్ సర్కార్ తిరుపతి ఎస్వీ యూనివర్సిటీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ డి. భాస్కర్ రెడ్డి, ప్రముఖ జ్యోతిష్య అధ్యాపకులు డాక్టర్ నేల రాజ్ కుమార్, గుంటూరు జెకెసి కాలేజ్ తెలుగు రిటైర్డ్ అసోసియేట్ ప్రొఫెసర్ ఎం. విజయశ్రీ, ఎస్ఎంఎస్ బిఈడి కళాశాలకు చెందిన లెక్చరర్ కప్పగంతు రామకృష్ణ ను అకాడమీ బోర్డుకు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ మురళీధర్ శర్మ ను అకాడమీలో పాలకవర్గ సభ్యులుగా, యూజీసీ నామినీగా నియమిస్తూ రాష్ట్ర ఉన్నత శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ సతీష్ చంద్ర జీవోలు జారీ చేశారు.

తెలుగు సంస్కృత అకాడమీలో పాలక వర్గ సభ్యుల నియామక ఉత్తర్వులు
తెలుగు సంస్కృత అకాడమీ పాలకవర్గంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్. అయితే తెలుగు అకాడమీ పేరును మార్చడం పై ఏపీ లోని పలు వర్గాలు,భాషాభిమానులు జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై మండిపడుతున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాషకు ప్రాధాన్యత తగ్గించేలా పాఠశాల స్థాయిలో విద్యాబోధన విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే.

జగన్ తాజా నిర్ణయంతో మొదలైన కొత్త రచ్చ .. తెలుగు అకాడమీ ఏర్పాటు ఇలా
ఇక తాజాగా తెలుగుభాష ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో కొత్త రచ్చ మొదలైంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో తెలుగు రాష్ట్రంలో తెలుగు అకాడమీ గల్లంతు కానుంది అన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తెలుగు భాష అభివృద్ధి కోసం తెలుగు అకాడమీని ఏర్పాటు చేస్తే, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు భాష కు గుర్తింపు తీసుకు వచ్చారు.

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇంకా తెగని అకాడమీ విభజన పంచాయితీ
తెలుగు భాష అభివృద్ధి కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వేదికగా తెలుగు అకాడమీ విశేషంగా కృషి చేసింది. రెండు రాష్ట్రాలు వేరయినా తర్వాత ఇంకా విభజన పంచాయితీలు కొనసాగుతూనే ఉన్నాయి. మార్చి నెలలో తెలుగు అకాడమీ ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల పంపకాలపై ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలని, సుప్రీం ధర్మాసనం ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది . తెలుగు అకాడమీపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విధంగా సూచించింది. తెలుగు అకాడమీ విభజనపై ఏకాభిప్రాయానికి రాకపోతే విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం వెల్లడించింది. ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.

సడన్ గా పేరు మార్పు అవసరం ఏంటి అని ప్రశ్నిస్తున్న భాషాభిమానులు
ఈ వివాదం ఇంకా తేల్చకుండానే ఈ సమయంలో తెలుగు అకాడమీ పేరు మారుస్తూ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం భాషాభిమానులకు అశనిపాతంగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తెలుగు అకాడమీ పేరు మార్చవలసిన అవసరాన్ని భాషాభిమానులు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications