నిమ్మగడ్డకు హైకోర్టులో దక్కని ఊరట.. ఆయన తొలగింపును ప్రభుత్వం ఎలా సమర్థిస్తోంది..?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా నిమ్మగడ్డ ప్రసాద్‌ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ఎలా తొలగిస్తారు అనేది చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా అధికార పక్షంపై విమర్శలు గుప్పించాయి. ఇప్పటికే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన తొలగింపు అక్రమం అని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా కోర్టులో ఆయనకు ఊరట లభించలేదు. 16 ఏప్రిల్‌లోగా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశిస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపుపై దాఖలైన అన్ని పిటిషన్లను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలగింపును సమర్థించుకునేందుకు ప్రభుత్వం గతంలోని రెండు తీర్పులను ప్రస్తావిస్తోంది. ఇంతకీ ఆ తీర్పులు ఏంటి..?
Recommended Video

నిమ్మగడ్డకు దక్కని ఊరట..కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు
ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఏపీ ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను తొలగిస్తూ గతవారం ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. దీంతో ఒక్కసారిగా కరోనా వైరస్ టాపిక్ నుంచి ట్రాక్ మారింది. ఈ ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో సహా పలువురు టీడీపీ నేతలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే దీనిపై విచారణ చేసిన ఏపీ హైకోర్టు ఏప్రిల్ 16లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. సోమవారం తుది విచారణ చేస్తామని పేర్కొంది. ఇక దీనిపై అభ్యంతరాలుంటే శుక్రవారంలోపు తెలపాలని పిటిషనర్లకు సూచించింది న్యాయస్థానం. ప్రస్తుతమైతే నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఊరట లభించలేదు. కేసు తుది విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది న్యాయస్థానం.

సుప్రీంకోర్టు ఇచ్చిన గత తీర్పులను ప్రస్తావించిన ఏపీ ప్రభుత్వం
ఇక నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సమర్థించుకుంటోంది. ఇందుకు గతంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తోంది. ఒక వ్యక్తి పదవీకాలాన్ని తగ్గించినంత మాత్రానా పదవి నుంచి తొలగించినట్లు కాదనేది మొదటి కేసు తీర్పు సారాంశం. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మెన్‌గా అప్పుడున్న కైలాష్ చంద్‌ను అర్థాంతరంగా తొలగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ విషయమై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా అత్యున్నత న్యాయస్థానం పై విధంగా తీర్పు చెప్పింది. అంతేకాదు చట్ట సవరణ జరిగిన తర్వాత అప్పటి వరకు ఉన్నవి కూడా మారుతాయంటూ న్యాయస్థానం పేర్కొంది. అయితే ఉత్తర్ ప్రదేశ్‌లో రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్న అమర్‌మిత్ ప్రసాద్ సింగ్‌ను తొలగించిన సమయంలో హిమాచల్ ప్రదేశ్ విషయంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించగా ఈ కేసులో మాత్రం సుప్రీంకోర్టు భిన్నంగా వ్యవహరించింది. స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు ఛైర్మెన్, రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి మధ్య చాలా తేడా ఉందని వెల్లడించింది. ఎస్ఈసీ స్వతంత్ర సంస్థ అని అదే స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుందని గుర్తు చేసింది.

అపర్మిత ప్రసాద్ సింగ్ కేస్ ఏంటి..?
అపర్మిత ప్రసాద్ సింగ్ ఐఏఎస్ అధికారి. ములాయం సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అపర్మిత ప్రసాద్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ములాయం సింగ్ చాలామంది అధికారులను బదిలీ చేస్తుండటాన్ని ఆయన ప్రశ్నించారు. ఇది ఓర్వలేక పోయిన ములాయం సర్కార్ వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికారి సర్వీసు నిబంధనల్లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో అపర్మిత ప్రసాద్ సింగ్‌ను తొలగించడం జరిగింది. ఆ సమయంలో బ్యూరోక్రాట్లు ప్రభుత్వానికి దాసోహమయ్యారంటూ అపర్మిత ప్రసాద్ సింగ్ నిప్పులు చెరిగారు.

ఈసీ, ఎస్‌ఈసీల విధివిధానాలు ఒక్కటే: సుప్రీంకోర్టు
2005లో కిసాన్ సింగ్ తోమర్ కేసులో కూడా సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, స్టేట్ ఎలక్షన్ కమిషన్‌ల విధివిధానాలు ఒక్కటే అని గుర్తు చేసింది. రెండు సంస్థలు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని రాజ్యాంగం చెబుతున్నాయని, ప్రభుత్వాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం లేదని చెబుతూనే వాటి స్వంత్రత గురించి గుర్తు చేసింది. ఇక అపర్మిత ప్రసాద్ సింగ్ కేసులో కీలక తీర్పును ఇచ్చింది అత్యున్నత న్యాయస్థానం. ప్రభుత్వాలు మారిన తర్వాత అన్ని రాజ్యాంగ కార్యకలాపాల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి పదవీకాలం విషయంలో మార్పలు చేయరాదని సూచించింది. ఇలా చేస్తే ఆర్టికల్ 243కేను ఉల్లంఘించినట్లు అవుతుందని వెల్లడించింది.

అభిశంసన ద్వారానే తొలగింపు... ?
హైకోర్టు న్యాయమూర్తి తొలగింపు ప్రక్రియ ఎలాగైతే ఉంటుందో అలానే ఎస్ఈసీ తొలగింపు ప్రక్రియ కూడా ఉంటుందని ఆర్టికల్ 243 కే చెబుతోంది. అయితే దీన్ని మార్చేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారాలు లేవని చెబుతూనే, ఆర్టికల్ 217లోని మరో అంశాన్ని ప్రస్తావించింది. పదవీ విరమణ లేదా తొలగింపునకు సంబంధించి ఈ ఆర్టికల్ పేర్కొంటోంది. ఆర్టికల్ 217 ప్రక్రియ చూసుకున్నట్లయితే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారి ఇక పదవిలో కొనసాగలేరని తెలుస్తోంది. ఇక సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునే ఏపీ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. పదవీకాలం తగ్గించడం వల్ల ఎన్నికల అధికారిని తొలగించలేరని అయితే ఆర్టికల్ 243కేలో ఉన్నట్లుగా అభిశంసన ప్రకియ ద్వారా తొలగించొచ్చనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పట్టుకుంది. నిమ్మగడ్డ తొలగింపులో కూడా ఇదే జరగనుంది.












Click it and Unblock the Notifications