ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మరో ముందడుగు..!!
APSRTC: ఏపీలో మహిళలు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న పథకం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం. అధికారంలోకి వచ్చిన వెంటనే దీన్ని అమలు చేస్తామంటూ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్.
ఇప్పుడు ఏడు నెలలు గడుస్తోన్నాయి. అయినప్పటికీ దీని ఊసే ఎత్తట్లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం. ఆగస్టు 15వ తేదీన ఖచ్చితంగా అమలుచేస్తామని ప్రకటించినప్పటికీ అది వాస్తవ రూపాన్ని దాల్చలేకపోయింది.

ఇప్పుడు మరో తేదీ బయటికొచ్చింది. సంక్రాంతి పండగ నాడు ఈ పథకాన్ని అమలు చేసేలా చర్యలు తీసుకుంటామంటూ రవాణా శాఖ మంత్రి రామ్‌ప్రసాద్ రెడ్డి ఇటీవలే వెల్లడించారు. త్వరలో మహిళలకు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీఎస్ఆర్టీసీ డోర్ డెలివరీ సర్వీస్‌ను ప్రారంభించిన సందర్బంగా ఆయన మాట్లాడారు.
సంక్రాంతి పండగ కానుకగా మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేసే దిశగా కసరత్తు చేస్తోన్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమల్లోకి తీసుకు రావాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.
ఈ దిశగా తాజాగా చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. ఉచిత బస్సు పథకం అమలు గురించి అధ్యయనం చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. మొత్తం ముగ్గురు మంత్రులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
రవాణా శాఖ, మహిళా- శిశు, గిరిజన సంక్షేమం, హోం మంత్రులతో ఈ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఈ కమిటీకి సమన్వయకుడిగా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఉచిత బస్సు సౌకర్యం అమలువుతున్న రాష్ట్రాల్లో పర్యటించి.. దీనిపై ఓ సమగ్ర నివేదికను అందజేయడం ఈ కమిటీ ముఖ్య ఉద్దేశం. ప్రస్తుతం కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకం అమలులో ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. పెద్దగా ఎలాంటి కమిటీలు, అధ్యయనాలు లేకుండానే మహిళల సంక్షేమాన్పి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గుర్తుంచుకుని దీన్ని అమలు చేసింది.












Click it and Unblock the Notifications