APPSC Group-1 mains: నిరుద్యోగులకు శుభవార్త: షెడ్యూల్ ఇదీ: హెల్ప్‌డెస్క్ నంబర్లు ఇవీ
అమరావతి: రాష్ట్రంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కోలాహలం సోమవారం నుంచి ఆరంభం కాబోతోంది. ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ఇదివరకే వెలువడింది. ఈ నెల 20వ తేదీ వరకు దశలవారీగా ఈ పరీక్షలను కొనసాగించనుంది. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు. కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం.. పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు.

ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు..
నిజానికి- గ్రూప్ వన్ పరీక్షలు కిందటి నెల 2వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించాల్సి ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు దీన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. మెయిన్స్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి హాల్ టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన మరేదైనా గుర్తింపు కార్డు తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. సపోర్టింగ్ డాక్యుమెంట్‌గా ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌లను చూపించాల్సి ఉంటుంది.

హెల్ప్ డెస్క్ నంబర్లు ఇవీ..
పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 0866-2527820, 0866-2527821, 0866-2527819 నంబర్లలో సంప్రదించాలని అధికారులు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతున్న పరీక్షలు కనుక, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని ఏపీపీఎస్సీ సభ్యులు సూచించారు. ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

9:30 గంటల కల్లా పరీక్షా కేంద్రాల్లోకి..
అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in నుంచి గ్రూప్-1 మెయిన్స్ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి ఉండగా.. అభ్యర్థులు తప్పనిసరిగా 9:30 గంటలకు ఆయా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. ఉదయం 8:45 గంటల నుంచి 9:30 గంటల మధ్య మాత్రమే వారికి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి ఇస్తారు.

ట్యాబ్ల ద్వారా ప్రశ్నాపత్రాలు..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులకు ట్యాబ్ల ద్వారా పరీక్షలను నిర్వహించనుంది ఏపీపీఎస్సీ. ఇంగ్లీష్, తెలుగు లాంగ్వేజీల్లో ప్రశ్నాపత్రాలను అందుబాటులో తీసుకొస్తుంది. అభ్యర్థులందరూ తప్పనిసరిగా మాస్కులను ధరించాల్సి ఉంటుంది. శానిటైజర్ ద్వారా చేతులను శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. కరోనా బారిన పడిన అభ్యర్థుల కోసం ఐసొలేషన్ కేంద్రాల్లోనే పరీక్షలను నిర్వహిస్తారు.

ప్రిలిమ్స్‌లో తప్పులు దొర్లడంతో..
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పేపర్‌లో తప్పులు దొర్లడంతో కిందటి నెల 2వ తేదీన జరగాల్సిన మెయిన్స్ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. తప్పులు దొర్లడం వల్ల తెలుగు మీడియం అభ్యర్థులు తీవ్రంగా నష్టపోయారంటూ అప్పట్లో అభ్యర్థులు హైకోర్టులో పిటీషన్‌ను దాఖలు చేశారు. పరీక్షలను నిర్వహించడానికి హైకోర్టు అనుమతి ఇవ్వడంతో తాజా సన్నాహాలు పూర్తయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలైంది. విచారణ నడుస్తోంది.