కొత్తగా 13 జిల్లాలు - 16 డివిజన్లు : ఉగాది నాడు ఏక కాలంలో - సీఎం జగన్ తుది కసరత్తు..!!
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే 13 కొత్త జిల్లాలకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ ఇవ్వటంతో దీని పైన అభ్యంతరాలు.. సలహాలు స్వీకరించారు. అన్ని పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు..సంస్థలు.. ప్రజల నుంచి దాదాపుగా 9 వేలకు పైగా అభ్యర్ధనలు వచ్చాయి. అందులో కీలకమైనవి అధికారులు స్క్రూటినీ చేసారు. జిల్లాల పేర్లు పైన అభ్యంతరాలు.. జిల్లా ప్రధాన కేంద్రాల పైన డిమాండ్లు.. రెవిన్యూ డివిజన్ల పెంపు వంటి అంశాల పైన ఎక్కవ మొత్తంలో డిమాండ్లు వచ్చాయి. వీటి పైన సీఎం తుది నిర్ణయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇక, ఈ నెల 29వ తేదీ నాటికి తుది నోటిఫికేషన్ కు రంగం సిద్దం చేస్తున్నారు. 30, 31 తేదీల్లో అన్ని రకాల ఏర్పాట్లు - ఉద్యోగుల సర్దుబాట్లు.. అధికారుల నియామకం పైన తుది కసరత్తు జరగనుంది. ఏప్రిల్ 1న కొత్త జిల్లాల పైన తుది నోటిఫికేషన్ విడుదల కానుంది. కొత్తగా 13 జిల్లాలతో పాటుగా తొలుత ప్రతిపాదించిన 11 కొత్త రెవిన్యూ డివిజన్ల సంఖ్యను 16కు పెంచుతూ సూత్ర ప్రాయంగా నిర్ణయించారు. ఇక, 1వ తేదీ సాయంత్రం కొత్త జిల్లాల అధికారిక గజెట్ విడుదలతో పాటుగా వాటికి కలెక్టర్లు..ఎస్పీల నియామక ఉత్తర్వులు జారీ కానున్నాయి.

ఇక, కొత్త జిల్లాల్లో పని చేసేందుకు తాత్కాలిక కేటాయింపుల కింద దాదాపుగా 10 వేల మంది ఉద్యోగులను ఎంపిక చేసారు.వారికి వర్క్ టు ఆర్డర్ కింద జిల్లాలకు కేటాయించనున్నారు. వారి సీనియార్టీకి.. సర్వీసుకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో కొత్త జిల్లాల ఏర్పాటు పైన న్యాయ పరమైన చిక్కులు సైతం లేకుండా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు. అన్నీ పూర్తి చేసిన తరువాత ఉగాది నాడు ముఖ్యమంత్రి జగన్ ఒకే సమయంలో కొత్త జిల్లాలను అధికారికంగా ప్రారంభిస్తారు. కొత్త జిల్లాలకు కలెక్టర్, ఒక జేసీ, ఎస్పీని ప్రభుత్వం నియమించనుంది.












Click it and Unblock the Notifications