కౌంటింగ్ వేళ వార్డు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు నోటీసులు..!!
ఏపీలో ఎన్నికల కౌంటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఓట్ల లెక్కింపుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీలు గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల వేళ సచివాలయ వాలంటీర్ల వ్యవహారం వివాదాస్పదంగా మారింది. పలువురు వాలంటీర్లు ఉద్యోగాలకు రాజీనామా చేసారు. ఇక..ఇప్పుడు ప్రభుత్వంలోని ముఖ్య అధికారులు గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించారు. అటెండెన్స్ పేరుతో షోకాజు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం.
నోటీసులు సిద్దం
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల జాబ్‌చార్ట్ ప్రకారం కాకుండా అదనపు పనిచేయించుకుంటున్న ప్రభుత్వం బయోమెట్రిక్ వేయడం లేదనే పేరుతో గ్రామ వార్డు సెక్రటేరియట్ ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్దం అవుతోంది. నోటీసులను మండలస్థాయిలో ఎంపిడిఓలు, పట్టణాల్లో కమిషనర్లు సిద్ధం చేశారు. సోమవారం నుండి వాటిని జారీచేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.30 లక్షల మంది ఉద్యోగులుండగా, వారిలో చాలామంది పని ఒత్తిడి కారణంగా ఏదో ఒక సందర్భంలో బయోమెట్రిక్ వేయని పరిస్థితులు ఉన్నాయి.

అధికారులకు సూచనలు
బయోమెట్రిక్ వేయని ఉద్యోగులను గుర్తించి, వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించి క్షేత్రస్థాయి అధికారులను ఆదేశించింది. గ్రామ వార్డు సచివాలయం రాష్ట్ర కార్యాలయం నుంచి జిల్లా అధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో డైరెక్టర్ శివప్రసాద్ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో శనివారం మండలస్థాయి అధికారులు షోకాజ్ నోటీసులు తయారు చేసే పనిలో నిమగమయ్యారు. గత వారం రోజులుగా అటెండెన్స్ వేయని ఉద్యోగుల వివరాలను సేకరించాలని ఎంపిడిఓలను డైరెక్టర్ ఆదేశించారు. శనివారం సాయంత్రానికి అధికారులు నివేదికను సిద్ధం చేశారు. దీని అధారంగా సోమవారం నోటీసులు ఇవ్వనున్నారు.
ఉద్యోగుల ఆగ్రహం
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను ప్రభుత్వ కార్యాలయాల్లో డిప్యుటేషన్‌పై నియమించారు. వీటితోపాటు ఆరోగ్య సురక్ష, వై ఎపి నీడ్స్ జగన్, ఆడుదాం ఆంధ్ర కింద క్రీడాకారుల ఎన్‌రోల్, కులగణన సర్వే, ప్రభుత్వ సంక్షేమం హెచ్‌సిఎమ్ లెటర్స్ ఇంటింటికీ పంపిణీ, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్లు, ఎన్నికల్లో బిఎల్‌ఓ డ్యూటీలు, ఇంటింటికీ ఓటర్ల స్లిప్పుల పంపిణీ, పోలింగ్‌కు కేంద్రాల సంసిద్ధత లాంటి పనులను ప్రభుత్వం చేయించింది. పని ఒత్తిడి అధికంగా ఉండటం, కార్యాలయం బయటకు వెళ్లాల్సి రావడంతో ఒక్కో రోజు బయోమెట్రిక్ సకాలంలో వేయలేకపోయారు. దీన్ని సాకుగా తీసుకుని నోటీసులిచ్చేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడాన్ని సచివాలయ ఉద్యోగులు తప్పుపడుతున్నారు.












Click it and Unblock the Notifications