జగన్ సర్కార్ సీరియస్ - కలెక్టర్లకు ఆదేశాలు : ఆ విషయంలో తగ్గేదే లేదు..!!
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె దిశగా అడుగులు వేస్తున్న వేళ..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రివర్స్ పీఆర్సీ అంటూ ప్రచారం చేస్తున్న వేళ...జీతం తగ్గలేదని ఆధారాలతో నిరూపించేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఇందు కోసం కొత్తగా నిర్ణయించిన పీఆర్సీ మేరకు జనవరి జీతాలు చెల్లించాలని ఆదేశించింది. ఉద్యోగ సంఘాలు ఈ నెలకు పాత వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి 1న జీతాలు చెల్లించాల్సిందేనని ఆర్దిక శాఖ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే డీడీఓలు..ట్రెజరీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

జనవరి వేతనాలు చెల్లించాల్సిందే
దీంతో...ట్రెజరీ ఉద్యోగులు సైతం ప్రభుత్వానికి మరి కొంత సమయం కావాలంటూ లేఖ రాసారు. అయితే, కొత్త పీఆర్సీ ప్రకారం ఉద్యోగులు, పెన్షనర్లకు బిల్లులు రూపొందించి, ప్రాసెస్ చేయడం, ఆమోదించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై రాష్ట్ర ఆర్థిక శాఖ కొరఢా ఝళిపించింది. ఎన్ని సార్లు ఆదేశాలు జారీ చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరించిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లను, విభాగాధిపతులను ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. కొత్త పే స్కేళ్ల ప్రకారం వేతనాలు, పెన్షన్లు చెల్లించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేసింది.

కలెక్టర్లకు చర్యల బాధ్యతలు
జీతాలు పెరగలేదని ఉద్యోగ సంఘాలు పెద్ద ఎత్తున చేస్తున్న ప్రచారం సరికాదని నిరూపించాలని ప్రభుత్వం ఈ విషయంలో పట్టుదలతో వ్యవహరిస్తోంది. పెరిగిన వేతనాలు చెల్లించటం ద్వారా వేతనాలు తగ్గాయనే ప్రచారినికి కౌంటర్ ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. వేతనాలు చెల్లింపు.. కొత్త పే స్కేల్స్ తో ప్లే స్లిప్పులు అధికారికంగా ఇవ్వటం ద్వారా అపోహలు తొలిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఉద్యోగుల్లో అపోహలు తొలిగించటంతో పాటుగా రాజకీయంగానూ సమాధానం ఇదే అవుతుందనేది ప్రభుత్వ అంచనా. దీంతో.. తాజాగా జారీ చేసిన సర్క్యులర్ లో ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి నుంచి పెరిగిన వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించాలని స్పష్టం చేసింది.

కొత్త పీఆర్సీ మేరకే వేతనాల బిల్లులు
ఇందుకోసం కొత్త పీఆర్సీ ప్రకారం పే స్కేళ్లు నిర్ధారించి ప్రాసెస్ చేసి.. వేతనాలు, పెన్షన్ బిల్లులను ఆమోదించడానికి పలు సార్లు నిర్ధిష్ట టైమ్‌లైన్‌తో ఆదేశాలు జారీ చేశాం. అయినా అందుకు అనుగుణంగా విధులు నిర్వహించడంలో చాలా మంది డీడీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరించి బిల్లులు రూపొందించలేదు. వేతన బిల్లులను ఎస్‌టీవోలు ఆమోదించ లేదు. ఇలాంటి వారందరినీ ఉపేక్షించేది లేదని అందులో తేల్చి చెప్పింది. కోవిడ్ క్లిష్ట సమయంలో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, పూర్తి, పార్ట్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు, రోజు వారీ వేతన కార్మికులు, హోంగార్డులు, ఆశా కార్యకర్తలు, అంగన్ వాడీ వర్కర్లు, మధ్యాహ్న భోజన సర్వీస్ ప్రొవైడర్లకు వేతనాలు చెల్లించలేని పరిస్థితి కల్పించిన అధికారులు, ఉద్యోగులపై సీసీఏ నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ
విధి నిర్వహణలో వైఫల్యం చెందిన డీడీవోలు, ట్రెజరీ అధికారులపై జిల్లా కలెక్టర్లు, విభాగాధిపతులు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. కొత్త పీఆర్సీ ప్రకారం జనవరి వేతనాలను ఫిబ్రవరి 1వ తేదీన చెల్లించేందుకు అవసరమైతే ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ట్రెజరీ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్ ఆఫీసర్ ప్రతిపాదించాలని కలెక్టర్లకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో..ఈ మధ్యాహ్నానికి కలెక్టర్ల నుంచి జీతాల బిల్లుల ప్రాసెస్.. ఎక్కడ అధికారులు ఎంత మేర పూర్తి చేసారనే దాని పైన సమాచారం సేకరించి..ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications