కొత్త సీఎం ప్రమాణస్వీకారం, కొలువుదీరిన ప్రభుత్వం
కేరళం (కేరళ) రాజకీయాల్లో ఒక సుదీర్ఘ పాలనకు తెర పడింది. గడచిన పదేళ్లుగా సాగిన లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) కోటను బద్దలు కొడుతూ.. కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) కేరళ పీఠాన్ని కైవసం చేసుకుంది. సోమవారం ఉదయం 10:30 గంటలకు తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియం సాక్షిగా కేరళ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ లీడర్ వి.డి. సతీశన్ (61) కేరళ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ఆయనతో పాటు 20 మంది సభ్యుల మంత్రివర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
కేరళలో పదేళ్ల తర్వాత కాంగ్రెస్ జెండా ఎగరడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. ఈ చరిత్రాత్మక ఘట్టాన్ని వీక్షించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం కదిలివచ్చింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విచ్చేశారు. వీరితో పాటు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి (తెలంగాణ), సిద్ధరామయ్య (కర్ణాటక), డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు ప్రత్యేకంగా హాజరై సతీశన్‌కు అభినందనలు తెలిపారు. అలాగే, కేరళ సంప్రదాయాన్ని గౌరవిస్తూ మాజీ సీఎం పినరయి విజయన్, మాజీ స్పీకర్ ఏ.ఎన్. షంషీర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్, సీపీఐ నేత బినోయ్ విశ్వం ఈ కార్యక్రమానికి హాజరు కావడం విశేషం.

రికార్డు స్పీడ్‌తో కేబినెట్ కూర్పు.. సామాజిక సమతుల్యత
ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటల లోపే ప్రభుత్వం ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి వి.డి. సతీశన్ సరికొత్త రికార్డు సృష్టించారు. కేరళ రాజకీయ చరిత్రలోనే ఇంత వేగంగా కేబినెట్ కూర్పు జరగడం ఇదే ప్రథమం. మొత్తం 20 మందితో కూడిన ఈ మంత్రివర్గంలో సీనియార్టీతో పాటు సామాజిక, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేశారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఇద్దరికి చోటు కల్పించడంతో పాటు మహిళా ప్రాతినిధ్యాన్ని కూడా నిర్ధారించారు.
#WATCH | Congress leader VD Satheesan takes oath as Chief Minister of Keralam at the Central Stadium in Thiruvananthapuram
— ANI (@ANI) May 18, 2026
(Source: PRD) pic.twitter.com/MKCPgnpO3F
కాంగ్రెస్ నుంచి సీనియర్ నేతలు రమేష్ చెన్నితాల, కె. మురళీధరన్, కేపీసీసీ చీఫ్ సన్నీ జోసెఫ్ కేబినెట్‌లో చేరగా.. కూటమిలోని కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) నుంచి పి.కె. కున్హాలికుట్టి, పి.కె. బషీర్, ఎన్. సంషుద్దీన్, కె.ఎం. షాజీ, వి.ఇ. అబ్దుల్ గఫూర్ మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. ఇతర మంత్రులుగా మోన్స్ జోసెఫ్, షిబు బేబీ జాన్, అనూప్ జాకబ్ సహా పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ నేత తిరువంచూర్ రాధాకృష్ణన్ బాధ్యతలు చేపట్టనున్నారు.
పారవూర్ 'అజేయుడు'.. విద్యార్థి నాయకుడి నుంచి సీఎం దాకా
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వి.డి. సతీశన్ కేరళ రాజకీయాల్లో క్లీన్ ఇమేజ్ ఉన్న నేత. 1964లో కొచ్చి సమీపంలోని నెట్టూర్‌లో జన్మించిన ఆయన వృత్తిరీత్యా న్యాయవాది. కేరళ స్టూడెంట్స్ యూనియన్ (KSU) ద్వారా విద్యార్థి దశలోనే రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, యూత్ కాంగ్రెస్ లీడర్‌గా, కేపీసీసీ ఉపాధ్యక్షుడిగా ఎదిగారు. ఎర్నాకులం జిల్లాలోని పారవూర్ నియోజకవర్గం నుంచి ఆయనకు తిరుగులేని ట్రాక్ రికార్డ్ ఉంది.
2001లో ఇక్కడి నుంచి మొదటిసారి గెలిచిన సతీశన్, తాజా 2026 ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి టైసన్ మాస్టర్‌పై 20,600 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తద్వారా పారవూర్ నుంచి వరుసగా ఆరోసారి (వరుసగా 25 ఏళ్లు) ఎమ్మెల్యేగా గెలిచి అజేయుడిగా నిలిచారు. 2021లో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అసెంబ్లీ లోపల, వెలుపల లెఫ్ట్ ప్రభుత్వంపై ఆయన చేసిన రాజీలేని పోరాటమే నేడు యుడిఎఫ్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టింది.
ఎన్నికల 'ఐదు గ్యారంటీల'పైనే కొత్త ప్రభుత్వం గురి
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు ముఖ్యమైన గ్యారంటీలను కొత్త ప్రభుత్వం వెంటనే అమలు చేస్తుందని సీనియర్ నేత రమేష్ చెన్నితాల స్పష్టం చేశారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ యువతులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, వృద్ధులకు రూ.3000 సంక్షేమ పెన్షన్, ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'తో పాటు చిన్న వ్యాపారులకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాల హామీలను నెరవేర్చేందుకు సరికొత్త కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు కొత్త మంత్రులు ప్రకటించారు.
నంబర్ గేమ్: ఎల్‌డీఎఫ్‌ను క్లీన్ స్వీప్ చేసిన యూడీఎఫ్
ఈసారి కేరళ ఓటరు దేవుడు యుడిఎఫ్‌కు స్పష్టమైన తీర్పునిచ్చాడు. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (UDF) ఏకంగా 102 సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీని నమోదు చేసింది. ఇందులో కాంగ్రెస్ సొంతంగా 63 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించగా, ఐయూఎంఎల్ 22 స్థానాల్లో జెండా ఎగరేసింది. గత అధికార కూటమి ఎల్‌డీఎఫ్ కేవలం 35 సీట్లకే పరిమితం కాగా, కేరళలో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ 3 స్థానాలను దక్కించుకుంది. పదేళ్ల తర్వాత కేరళలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడంతో అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ కేడర్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.














Click it and Unblock the Notifications