ఏపీలో ప్రజల ఆస్తులకు భద్రత కల్పించేలా కీలకనిర్ణయం.. కేంద్రంతో సంప్రదింపులు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే మరోవైపు, పరిపాలనలో కీలక నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ఇదే క్రమంలో ఏపీలో ప్రజల ఆస్తులను డిజిటల్ రూపంలో భద్రపరచడం కోసం ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. నగరాలు, పట్టణాలలో ప్రతి కుటుంబానికి ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
2027 మార్చిలోగా నక్ష సర్వే పూర్తి చేసి ప్రాపర్టీ కార్డులు
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తీసుకోనుంది. వాస్తవానికి గత సంవత్సరం ఫిబ్రవరిలో నక్ష గడువు ముగిసింది. రికార్డుల ఎంట్రీ మరియు మ్యాపింగ్ పనులు పూర్తి కాలేదు. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియను వేగవంతం చేసి 2027 మార్చిలోగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం కేంద్రంతో మాట్లాడి సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది.

ఏపీలో ఆ నగరాలను ఎంపిక చేసిన కేంద్రం
నేషనల్ జియోస్పేషియల్ నాలెడ్జ్ బేస్డ్ ల్యాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ ప్రాజెక్టు కింద మళ్లీ సర్వే చేసి ఇల్లు, ఇతర ఆస్తులు, భూములకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని భావిస్తోంది. కేంద్రం 2024లో నక్ష ప్రాజెక్టును మొత్తం 152 నగరాలు, పట్టణాలలో ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ, ఏలూరు, గుంటూరు, మంగళగిరి- తాడేపల్లి, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, కుప్పం, అనంతపురంలను ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు.
2027 మార్చిలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని భావిస్తున్న ఏపీ
వాస్తవానికి గత ప్రభుత్వ హయంలో సర్వే పూర్తి చేసిన తర్వాత రికార్డుల ఎంట్రీ, మ్యాపింగ్ ప్రక్రియ చేపట్టలేదు. అయితే ఇప్పటికే దేశంలో అనేక రాష్ట్రాలలో ప్రాపర్టీ కార్డులు చేయడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్న వేళ ఏపీలో కూడా 2027 మార్చిలోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాపర్టీ కార్డులను జారీ చేయగలిగితే ఇళ్ళు, భూములు, స్థలాలు వివరాలు కార్డులో ఉంటాయి.
ప్రాపర్టీ కార్డులతో ప్రయోజనాలు ఇలా
క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు తక్షణం తెలుస్తాయి. బ్యాంకుల నుంచి రుణాలు సులభంగా వస్తాయి. ఆస్తుల వివాదాలకు చెక్ పడుతుంది. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ప్రక్రియ సులభతరం అవుతుంది. నక్షా ప్రాజెక్టు కింద డ్రోన్లు మరియు GIS టెక్నాలజీ ఉపయోగించి సర్వే చేసి, ప్రాపర్టీ కార్డులు జారీ చేయనున్నారు. ఇది ప్రజల ఆస్తులకు దీర్ఘకాలిక భద్రత కల్పిస్తుందని అధికారులు చెబుతున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications