తిరుమల తరహాలో అమరావతి శ్రీవారి ఆలయం- మాడవీధులు, నిత్య కైంకర్యాలు..!!
శ్రీవారి భక్తులకు పండుగ లాంటి వార్త. తిరుమల తరహాలోనే అమరావతిలో శ్రీవారి ఆలయం తీర్చి దిద్దేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి. తిరుమల క్షేత్ర వైభవాన్ని అమరావతిలోనే సాక్షాత్కరించే లా రూపకల్పన చేస్తున్నారు. తిరుమల ఆలయ తరహాలోనే మాడవీధులు.. పుష్కరిణితో పాటుగా స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో నిర్వహించేందుకు నిర్ణయం జరిగింది. ఇందు కోసం రూ 185 కోట్లతో ప్రణాళికలు సిద్దం చేసారు. త్వరలోనే అమరావతి కేంద్రంగా తిరుమల తరహాలో భక్తులకు కొత్త అనుభూతి కలిగేలా కసరత్తు జరుగుతోంది.
అమరావతిలో శ్రీవారి ఆలయం
అమరావతి కేంద్రంగా శ్రీవారి ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చి దిద్దేందుకు కసరత్తు కొనసాగు తోంది. అమరావతి నిర్మాణ పనులతో పాటుగా శ్రీవారి ఆలయాన్ని అద్బుతంగా తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం సిద్దమైంది. అమరావతిలోని ఆలయం చుట్టూ భారీ ప్రాకారం, ప్రధాన ముఖద్వారం వద్ద ఏడు అంతస్తులతో మహారాజ గోపురం, మూడు దిక్కుల్లో ఐదు అంతస్తులతో గోపురాలు, మాడ వీధులు, పుష్కరిణితో పాటు స్వామివారికి నిత్య కైంకర్యాలు, ఉత్సవాలతో అమరావతిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చిదిద్దేలా అధికారులు ప్రణాళిక లు సిద్దం చేసారు. ఇందు కోసం రూ 185 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

కొత్త ప్రణాళికలు
ఈ నెల 15న అమరావతిలో శ్రీవారి కల్యాణం నిర్వహించారు. ఆ సమయంలోనే ఆలయం విస్తరణ పైన చర్చ జరిగింది. కొత్త ప్రణాళికల పైన ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. సీఎం ఆమోదంతో పనులు వేగంగా జరగనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం వెంకటపాలెం వద్ద ప్రధాన అనుసంధాన రహదారికి, కృష్ణా కరకట్టకు మధ్యలో 25 ఎకరాలను కేటాయించింది. రూ.150 కోట్ల అంచనా వ్యయంతో తిరుమలను తలపించేలా శ్రీవారి ఆలయం నిర్మించాలన్నది ఆలోచన. ఈ ప్రతిపాదనకు టీటీడీ ధర్మకర్తల మండలి 2018లో ఆమోదం తెలిపింది. ఆ తరువాత పనులు వేగంగా జరగలేదు. అమరావతిలోని వేంకటేశ్వర ఆలయానికి మాత్రం భక్తుల సంఖ్య ఎక్కువగా కొనసాగుతోంది. రాజధాని ప్రాంతంలో ఇప్పుడు ఈ ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చి దిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాలయానికి లోపలి ప్రాకారం మాత్రమే ఉండగా, ఇప్పుడు వెలుపలి ప్రాకారాన్నీ నిర్మించనున్నారు.
తిరుమల తరహాలోనే
తాజా ప్రణాళికల ప్రకారం వెలుపలి ప్రాకారానికి తూర్పు దిక్కున మహారాజగోపురం, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశల్లో రాజగోపురాలు ఉంటాయి. వాటితో పాటు కల్యాణోత్సవ, ఉత్సవ మండపా లను రూ.84 కోట్లతో నిర్మించనున్నారు. ఆర్జిత సేవల మండపం, వాహన మండపం, అద్దాల మం డపం, రాధా మండపం, ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి నిర్మిస్తారు. ఆలయ ప్రాంగణం లో కట్‌స్టోన్ ఫ్లోరింగ్ ఏర్పాటు చేస్తారు. ఆలయానికి చుట్టూ మాడ వీధులు, అప్రోచ్ రహదారులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్నదానం కాంప్లెక్స్, అర్చకులు, సిబ్బంది క్వార్టర్లు, రెస్ట్ హౌస్, భక్తులు వేచివుండే హాల్ వంటి నిర్మాణాల్ని రూ.20 కోట్లతో చేపడతారు. రూ.20 కోట్లతో ధ్యాన మందిరాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.












Click it and Unblock the Notifications