అమరావతి టూ విశాఖ- మే నెలలో ముహుర్తం
ఏపీ కార్యనిర్వాహక రాజధాని అమరావతి నుంచి మే నెలలో విశాఖకు తరలిపోనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వం ఉన్నతాధికారుల ద్వారా సచివాలయ ఉద్యోగ సంఘాలకు తద్వారా ఉద్యోగులకూ సమాచారం ఇచ్చింది. మూడు రాజధానులపై అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో తమకు క్లారిటీ ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో మే నెలలోనే తరలింపు ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మే నెలలోనే విశాఖకు రాజధాని
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియకు ఏర్పడిన అడ్డంకులన్నీ త్వరలోనే పరిష్కారమవుతాయని భావిస్తున్న వైసీపీ సర్కారు ఈ మేరకు మే నెలలో రాజధాని తరలింపుకు సిద్దమవుతోంది. శాసనమండలి రద్దుతో పాటు మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం, అమరావతి రైతులకు పరిష్కారం చూపడం వంటి అంశాలను వచ్చే నెలలో చకచకా పూర్తి చేసుకుని, విద్యార్ధుల పరీక్షలు పూర్తి కాగానే మే నెలలో రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మేలో విశాఖ వెళ్లేందుకు సిద్ధం కావాలని ఉద్యోగులకు క్లారిటీ
ప్రస్తుతం పరీక్షల సీజన్ కావడం, వచ్చే విద్యా సంవత్సరం నాటికి విశాఖ వెళ్లాల్సి వస్తే అక్కడ పిల్లలకు విద్యా సంస్ధల్లో సీట్లు తీసుకోవడం, ఇతర కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలంటే తమకు రాజధానిపై క్లారిటీ ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కొంతకాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మే నెలలో విశాఖకు సచివాలయం తరలింపు ప్రారంభం కానుందని ఉద్యోగులకు ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు స్పష్టత ఇచ్చారు. దీంతో ఉద్యోగులకు ఊరట లభించినట్లయింది.

విశాఖకు ముందుగా వెళ్లేది వీరే
మే నెలలో విశాఖకు రాజధాని తరలింపు ప్రారంభం కాగానే అక్కడి నుంచే పాలన ప్రారంభించేలా ఇప్పటికే అధికారులు కసరత్తు చేస్తున్నారు. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయంతో పాటు సచివాలయం కోసం భవనాల అన్వేషణ కొనసాగుతోంది. అయితే ముందుగా సాధారణ పరిపాలన శాఖతో పాటు న్యాయ, ఆర్దిక శాఖల సిబ్బందిని తరలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివర్లో సంక్షేమ శాఖలు విశాఖకు వెళ్లే అవకాశం ఉండొచ్చని చెబుతున్నారు.
Recommended Video


రాజధాని తరలింపుపై ప్రభుత్వం ధీమా ఏంటి
విశాఖకు రాజధానిని తరలించాలంటే ముందుగా ఇప్పటికే శాసనసభ ఆమోదించిన రెండు కీలక బిల్లులపై స్పష్టత రావాల్సి ఉంది. మండలి రద్దయితే మాత్రం వీటిపై ఉన్న సందిగ్దత తొలగిపోతుంది. అప్పుడు గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం ద్వారా తరలింపు ప్రక్రియ మొదలవుతుంది. అదే సమయంలో నిత్యం ఆందోళనలు చేస్తున్న అమరావతి రైతులకు ప్రభుత్వం ఇప్పటికే మెరుగైన ప్యాకేజీ ప్రకటించింది. తరలింపుకు ముందు ఆందోళనలు మరింత పెరగకుండా ప్యాకేజీలో మరిన్ని మార్పులు చేసే అవకాశాలూ లేకపోలేదు.
మొత్తం మీద రాజధాని తరలింపు మేలోనే ఉంటుందని ఏపీ సర్కారు ఉద్యోగ సంఘాలకు క్లారిటీ ఇవ్వడంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వం తెరవెనుక గట్టిగానే హోమ్ వర్క్ చేస్తున్నట్లు అర్ధమవుతోంది.












Click it and Unblock the Notifications