కేంద్రానికి చంద్రబాబు స్పెషల్ రిక్వెస్ట్..!!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తరువాత అధికార యంత్రాంగం పైన కసరత్తు ప్రారంభించారు. నూతన డీజీపీని నియమించారు. పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు. ఏపీ అసెంబ్లీ కొలువు తీరనుంది. ఇదే సమయంలో కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు పాలనా పరమైన అంశంపై కేంద్రానికి తాజాగా లేఖ రాసారు. కేంద్రం స్పందన కీలకంగా మారనుంది.
చంద్రబాబు లేఖ
ఎన్నికల్లో గెలిచిన తరువాత చంద్రబాబు చేసిన తొలి నియామకం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి. నీరభ్ కుమార్ ప్రసాద్ ను సీఎస్ గా నియమించారు. నీరభ్ కుమార్ ప్రసాద్ సీనియార్టీ ప్రకారం సీఎస్ కావాల్సి ఉంది.. కానీ గత ప్రభుత్వ హయాంలో జవహర్‌రెడ్డి సీఎస్ గా కొనసాగారు. ఎన్నికల ఫలితాల తరువాత జవహర్ రెడ్డిని సెలవు పై వెళ్లాల్సిందిగా సూచించారు. ఆయన స్థానంలో నీరభ్ కు అవకాశం దక్కింది. ఈ నెలాఖరుతో నీరభ్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ సమయంలోనే చంద్రబాబు స్పందించారు.

కేంద్రం అనుమతి
నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకు కేంద్రం అనుమతి అవసరం కావటంతో చంద్రబాబు దీని పైన కేంద్రానికి లేఖ రాసారు. డీఓపీటీ అధికారులు ప్రధాని మోదీ అనుమతితో ఈ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతంలోనూ రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్దనలను కేంద్రం ఆమోదించింది. ఇప్పుడు కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు తన సీఎస్ పదవీ కాలం కొనసాగింపు పైన రాసిన లేఖకు కేంద్రం అనుమతి ఇవ్వాల్సి ఉంది. ఆమోదం లాంఛనమేనని అధికారులు భావిస్తున్నారు.
కొత్త టీం కూర్పు
అయితే, ఒకేసారి ఆరు నెలల కొనసాగింపు ఇస్తారా..లేక తొలుత మూడు నెలలకే అనుమతి ఇస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.అయితే, నీరభ్ మరో ఆరు నెలలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగటం ఖాయమని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇటు ప్రభుత్వం మరికొంత మంది ఐఏఎస్ లతో పాటుగా ఐపీఎస అధికారుల బదిలీల పైన కసరత్తు చేస్తోంది. ఈ రోజు దీనికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా సలహాదారుల నియామకం పైన చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు.












Click it and Unblock the Notifications