'ఇది ఒక చరిత్ర‌': పల్స్ సర్వేలో స్వయంగా వివరాలు చెప్పిన చంద్రబాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా సాధికార సర్వేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం తన నివాసం నుంచి ప్రారంభించారు. అధికారులకు చంద్రబాబు కుటుంబ సభ్యుల వివరాలను స్వయంగా తెలియజేసి అందులో నమోదు చేయించుకున్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సాధికారత సాధించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేపడుతున్నామని వ్యాఖ్యానించారు. 'ఇది ఒక చరిత్ర‌.. రాష్ట్రంలోని ప్ర‌జ‌ల‌ వ్య‌క్తిగ‌త వివ‌రాల‌న్నీ తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాం. ఇది ఒక వినూత్న కార్య‌క్ర‌మం' అని అన్నారు.

ఈ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు. లబ్ధిదారులకే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందడంలో ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. 'ప్ర‌భుత్వ ప‌థ‌కాలు నేరుగా అర్హుల‌కే అందుతాయి. ఈ స‌ర్వే వ‌ల్ల సామాజిక స్థితిగ‌తులు మెరుగు ప‌డ‌తాయి' అని చంద్ర‌బాబు చెప్పారు.

ప్రజలకు సంబంధించిన అన్ని వివరాలు తెలిస్తే వాటికి తగ్గట్టుగా అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ముందుకు తీసుకెళ్లొచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి, కులాల వారికి ఎటువంటి అన్యాయం జ‌ర‌గ‌కుండా ఈ సర్వే ఎంతగానో ఉప‌యోగప‌డుతుంద‌ని చెప్పారు. సమాజంలోని ఆర్థిక అసమానతలను తొలగిస్తామని ఆయన పేర్కొన్నారు.

ఈ స‌ర్వే పూర్తి అయిన వెంటనే ప్ర‌జా సంక్షేమం కోసం ఓ స్థూల ప్ర‌ణాళికను రూపొందిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. రాష్ట్రంలోని అణగారిన వారిని ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సంయుక్త కార్యదర్శి ప్రద్యుమ్న, ప్రభుత్వ ఐటీ సలహాదారు జె.సత్యనారాయణ, సమాచారశాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాబు, గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతీలాల్‌ దండే తదితరులు పాల్గొన్నారు.

సుమారు 30 వేల మందితో ఆరు వారాల పాటు ఈ సర్వేని నిర్వహించనున్నారు. ఈ సర్వే ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు సంబంధించి వివిధ శాఖల్లో ఉన్న సమాచారాన్నంతా ఒక చోటకి తీసుకురావడంతో పాటు ప్రతి ఒక్కరికి సంబంధించిన కుల, మత, ప్రాంత, సామాజిక, ఆర్థిక పరమైన అంశాలు ప్రభుత్వం వద్ద సమగ్రంగా నమోదు కానున్నాయి.

తద్వారా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ కార్యక్రమాలకు ఈ సర్వే బాగా ఉపయోగపడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సర్వే ద్వారా 'జిప్పర్‌ కోడ్‌' పేరిట ప్రతి ఇంటికీ డిజిటల్‌ కోడ్‌, 8 అక్షరాల్లో సరికొత్త నెంబర్లు జారీ చేయనున్నారు. రోజుకు ఒక్కో సిబ్బంది 15 నుంచి 20 కుటుంబాల సమాచారం సేకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సర్వేతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదు: మ‌ంత్రి ప్ర‌త్తిపాటి

ప్ర‌జల‌ వివ‌రాల‌ను స‌మ‌గ్రంగా సేక‌రించడమే ల‌క్ష్యంగా ఏపీ ప్ర‌భుత్వం నిర్వహిస్తున్న ప్ర‌జా సాధికార స‌ర్వే ప్రారంభ‌మైంది. గుంటూరు జిల్లా చిలకలూరి పేటలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స‌ర్వేను ప్రారంభించారు. త‌న కుటుంబ వివ‌రాల‌ను అధికారుల‌కు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన స‌ర్వేపై ప్ర‌జ‌లు ఎటువంటి అపోహ‌లు, అనుమానాలు పెట్టుకోవ‌ద్ద‌ని అన్నారు. ప్రజా సాధికార సర్వేతో ఎవరికీ ఎలాంటి నష్టం వాటిల్లదని ప్ర‌త్తిపాటి స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను మరింత చేరువ చేయ‌డ‌మే త‌మ‌ ల‌క్ష్యమ‌ని ఆయ‌న అన్నారు.

స‌ర్వే అనంత‌రం సరైన ప్ర‌ణాళిక‌ను రూపొందించి ప్ర‌భుత్వ సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేస్తామ‌ని ఆయన పేర్కొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Andhra Pradesh Govt 'Smart Pulse Survey' Begin From AP CM Chandrababu Naidu House in Vijayawada.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి