మరో ఎన్నికల హామీ అమలు ముహూర్తం ఖరారు..!!
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మరో ఎన్నికల హామీ అమలు దిశగా అడుగులు వేస్తోంది. ఇందుకు ముహూర్తం ఖరారు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇంటి స్థలాలతో పాటుగా.. ఇళ్ల పంపిణీ పైన హామీ ఇచ్చింది. అమల్లో భాగంగా తాజాగా ఇళ్ల పథకం అమలు.. స్థలాల ఖరారు పైన ఫోకస్ చేసింది. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా 1.14 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పంపిణీ ముహూర్తం ఫిక్స్ అయింది.
ఏపీలో పేదల ఇళ్ల పంపిణీకి ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి పార్ధసారధి కీలక ప్రకటన చేసారు. రాష్ట్రంలో నిర్మాణం పూర్తయిన పేదల ఇళ్లను ఫిబ్రవరి 1న ప్రారంభించి, వాటిని 1.14 లక్షల లబ్ధిదారులకు అందజేయనున్నట్లు పార్థసారథి వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్బరాబు తణుకు నియోజకవర్గంలోని తేతలిలో లబ్ధిదారులకు ఇళ్ల తాళాలను అందజేస్తారని తెలిపారు. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఇళ్ల లబ్ధిదారులకు తాళాలను అందజేస్తారని చెప్పుకొచ్చారు. పీఎంఏవై 1.0 గడువు 2025 డిసెంబరు వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించిందని మంత్రి చెప్పారు.

దీంతో, ఈ పథకంలో భాగంగా 7 లక్షల ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వివరించారు. ఇంటి స్థలాల ఖరారు విషయం పైన ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందు కోసం పేదలకు ఇళ్ల స్థలాల కోసం విధివిధానాలు రూపొందించేందుకు రాష్ట్ర స్థాయి లో రెవెన్యూ మంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఎన్టీఆర్ హౌసింగ్ స్కీం లబ్ధిదారులకు బిల్లులు చెల్లించేందు కు రూ. 900 కోట్లు విడుదలకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. అదే విధంగా జగనన్న కాలనీలను రద్దు చేయడమే కాకుండా ఇకపై ఎన్టీఆర్ కాలనీల పేరుతో పేదలకు ఇళ్లు నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications