చంద్రబాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసు: ఏపీ హైకోర్టులో..!!
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

అదే సమయంలో పోలీసులు- చంద్రబాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసును నమోదు చేశారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులపై దాడులకు ప్రోత్సహించారనే కారణంతో ఈ కేసు పెట్టారు.
చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు పోలీసులపై పెద్ద ఎత్తున దాడులకు దిగారు అప్పట్లో. వారిపై రాళ్లదాడులు చేశారు. కానిస్టేబుళ్లు, ఆర్మ్డ్ రిజర్వుడ్ పోలీసులు గాయపడ్డారు. టీడీపీ కార్యకర్తలు విసిరిన రాయి తగిలిన ఓ కానిస్టేబుల్ కంటిచూపును సైతం కోల్పోయిన విషయం తెలిసిందే. పోలీసుల వాహనాలనూ తగులబెట్టారు టీడీపీ నాయకులు.
ముందస్తు ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందంటూ జిల్లా పోలీసు సూపరింటెండ్ నిర్ధారించారు. టీడీపీ కార్యకర్తల వద్ద బీర్ బాటిళ్లు, కర్రలు, రాళ్లతో పుంగనూరు జాతీయ రహదారికి చేరుకున్నారని, దీనికి తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని వివరించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ నాయకుడి కారులో పోలీసులు గన్, బుల్లెట్లను గుర్తించడం కలకలం రేపింది.
చంద్రబాబు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టడం వల్లే వాళ్లు ఈ దాడికి పాల్పడ్డారనేది సీసీటీవీ ఫుటేజీల ద్వారా నిర్ధారించిన పోలీసులు చంద్రబాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసును నమోదు చేశారు. దీనిపై చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై వాదనలు ముగిశాయి. తీర్పును రెండు రోజుల కోసం రిజర్వ్ చేసింది హైకోర్టు.












Click it and Unblock the Notifications